ఉమ్మడి పాలనలో పేదల వైద్య సేవలకోసం కేటాయించిన నిధుల్లో జరిగిన అవినీతిపై టీఆర్ఎస్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. 2007 నుంచి 2013 వరకు వరంగల్ ఎంజీఎం వైద్యశాలలో ఆక్సిజన్ సరఫరా చేయకుండానే డబ్బు స్వాహా చేసినట్లు ఆరోపణలు రాగా 2016లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం ద్వారా విచారణ చేయించిన ప్రభుత్వం అక్రమాల బాగోతాన్ని బట్టబయలు చేసింది. 2018 నుంచి సంబంధిత స్వాహాకారులపై కేసులు నమోదు చేస్తూ రాగా, తాజాగా మరో ఇద్దరు అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. వ్యవహారంలో రూ.2.30కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తించి, తిన్న మొత్తాన్ని సంబంధిత వ్యక్తుల నుంచి కక్కించేందుకు రంగం సిద్ధం చేసింది. ఆక్సిజన్ సరఫరా చేసినట్లు చెబుతున్న తులసీ ఏజెన్సీస్ నుంచి రూ.59.31 లక్షలు రికవరీ చేయాలని, అవినీతికి పాల్పడిన అధికారుల నుంచి మిగిలిన మొత్తాన్ని రాబట్టడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
– వరంగల్, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమైక్య రాష్ట్రంలో పేదల వైద్య సేవల కోసం కేటాయించిన నిధులు పక్కదారి పట్టడంపై టీఆర్ఎస్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల(ఎంజీఎంహెచ్)లో ఆక్సిజన్ సరఫరాలో అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి చట్టబద్ధంగా చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేయగా, తాజాగా మరో ఇద్దరు బాధ్యులపై చర్యల కోసం వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమాలు జరిగినప్పుడు ఎంజీఎంహెచ్ ఆర్ఎంవోగా పని చేసిన డాక్టర్ సీ నరేంద్రకుమార్‌తోపాటు మరో సీనియర్ అసిస్టెంట్‌కు సంబంధించి పెన్షన్ చెల్లింపుల్లో చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2007 నుంచి 2013 వరకు పేదల వైద్యం కోసం ఆక్సిజన్ కొనుగోలు పేరిట జరిగిన అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించి విచారణ చేయించింది. ఆక్సిజన్ సరఫరా చేయకున్నా చేసినట్లు చూపి నిధులను పక్కదారి పట్టించినట్లు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణలో తేలింది. అనంతరం ఈ కేసులను ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేయగా విచారణ నివేదిక ఆధారంగా అక్రమాలకు బాధ్యులపైన వారిపై సీఐడీ 2018లో కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది. విచారణ ప్రక్రియలో భాగంగా బాధ్యులైన అధికారులపై ప్రభు త్వం చర్యలను కొనసాగిస్తున్నది. ఈ వ్యవహారం లో భాగస్వాములైన అందరిపైనా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందుకు పోతున్నది.
కాంగ్రెస్ సర్కారు హయాంలో పేదల వైద్య సేవల పేరిట సొమ్ము చేసుకునే వ్యవహారాలు కొనసాగాయి. ఈ క్రమంలో 2007 నుంచి 2013 వరకు ఎంజీఎంలో రోగుల కోసం ఆక్సిజన్ సరఫరా చేయడంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ వ్యవహారంపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖ విచారణ జరిపింది. ఆక్సిజన్ సరఫరాలో అక్రమాలు నిజమేనని తేల్చింది. రూ.2.30 కోట్ల మేరకు నిధులు పక్కదారి పట్టాయని, దీనికి బాధ్యులైన అధికారుల నుంచి సొమ్ము రికవరీ చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. ఆక్సిజన్ సరఫరా చేసిన తులసీ ఏజెన్సీస్ నుంచి రూ. 59.31 లక్షలు రికవరీ చేయాలని ప్రతిపాదించింది. అవినీతికి పాల్పడిన అధికారుల నుంచి మిగిలిన మొత్తాన్ని రికవరీ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఆక్సిజన్ సరఫరాలో అక్రమాలు జరిగిన 2007 నుంచి 2013 మే వరకు ఎంజీఎం సూపరింటెండెంట్లుగా పని చేసిన సీ రఘురాం, ఎన్ వెంకటరాజయ్య, టీ సురేందర్, డాక్టర్ ఈ అశోక్‌కుమార్, డాక్టర్ ఎం సత్యదేవ్, ఏఎన్ఆర్ లక్ష్మి, అప్పుడు ఆర్‌ఎంవోలుగా పని చేసిన డాక్టర్ జీఎస్ నర్సింహన్, డాక్టర్ పీ సాంబశివరావు, డాక్టర్ కే నాగేశ్వర్రావు, డాక్టర్ వీ విష్ణుమోహన్, డాక్టర్ బీ శ్యాంసుందర్‌రావు(అనస్థీషియా), స్టోర్స్ మెడికల్ ఆఫీసర్ సీ నరేంద్రకుమార్, అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసిన డాక్టర్ కే అరుంధతి, డాక్టర్ బెంజమెన్ శామ్యూ ల్, డాక్టర్ ఎస్ రాంకిషన్, లక్ష్మీరాజం, అడ్మిన్ ఆఫీసర్లుగా పని చేసిన డాక్టర్ సీ నారాయణరెడ్డి, డాక్టర్ నర్సింహులు, నిర్మలపై కేసుల నమోదుతోపాటు రికవరీకి విజిలెన్స్ శాఖ ప్రతిపాదించింది. అక్రమాలు జరిగిన కాలంలో పని చేసిన మరికొందరు కార్యాలయ సిబ్బందిపైనా శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. విజిలెన్స్ నివేదికలో చర్యలకు ప్రతిపాదించిన దాదాపు అందరు అధికారులు రిటైర్డ్ అయిన వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారిపై నిబంధనల మేరకు చర్యలు చేపడుతున్నది. ప్రభుత్వ చర్యలను సవాలు చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖ నివేదిక అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.