హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 18 : సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని శివుడికి ప్రత్యేక పూజలు చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహా శివరాత్రి సందర్భంగా శనివారం ఆయన హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయాన్ని సందర్శించారు. మంత్రి ఎర్రబెల్లికి ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు, అధికారులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఆలయాలకు మహర్దశ పట్టిందన్నారు. యాదాద్రి, వేములవాడ, కొండగట్టును గత పాలకులు పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో రూ.వం దల కోట్లతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పా రు. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నాటి కాకతీయుల స్ఫూర్తితోనే నేడు దేవాలయాలకు పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి కూడా అద్భుతంగా జరుగుతోందని, అందుకే సీఎం కేసీఆర్ పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్-రేవతి దంపతులు రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక రుద్రాభిషేకాలు చేసి, ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేవాలయాలను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారని, కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి-జ్యోతి దంపతులు స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని భవంతుడిని వేడుకున్నారు.
ఇటు రాష్ట్రంలో అటు దేశం లో సీఎం కేసీఆర్ సేవలు కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రధాని కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే వెంట రెడ్‌క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు ఉన్నారు. అలాగే, పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ దంపతులు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, తోట వెంకన్న, రఘుపతిరావు, జిల్లా జడ్జి కృష్ణమూర్తి, వరంగల్ న్యాయమూర్తి రాధాదేవి, వరంగల్ ఏసీపీ బోనాల కిషన్, వాగ్దేవి కాలేజీ అధినేత చందుపట్ల దేవేందర్‌రెడ్డి పూజలు చేశారు. హనుమకొండ సీఐ శ్రీనివాస్‌జీ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, వేదపండితుడు మణికంఠశర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.