కాశీబుగ్గ, ఆగస్టు 31: ఖరీదు వ్యాపారులు ఆన్లైన్ ద్వారా ఎగుమతుల పర్మిట్ పొందేందుకు ప్రతి నెల 10వ తేదీలోగా పర్చెస్ రిటర్న్స్‌ను మార్కెట్ కమిటీ కార్యాలయంలో అందజేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సంచాలకులు జీ లక్ష్మీబాయి సూచించారు. శనివారం ఆమె వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రధాన కార్యాలయంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతోపాటు ఖమ్మం, జమ్మికుంట, మహబూబాబాద్, జనగామ మార్కెట్ సెక్రటరీలతో సమీక్షించారు.
ఈ సందర్భంగా అడ్తి, ఖరీదు వ్యాపారుల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వచ్చే సీజన్లో ఆన్లైన్ ఎగుమతుల పర్మిట్ కోసం ప్రతి ఖరీదు వ్యాపారి మార్కెటింగ్ శాఖ ఇచ్చే ప్రొఫార్మా ప్రకారం వివరాలు అందించాలని సూచించారు. త్వరలోనే సీసీ కెమెరాల ఏర్పాటు, వేబ్రిడ్జిని ఉపయోగంలోకి తెస్తామన్నారు. అదనంగా పీవోసీ మిషన్లు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. మద్దతు ధరతో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు త్వరలోనే కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
అనంతరం ఆమె లక్ష్మీపురంలోని మోడల్ కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. షెటర్ల అద్దె తగ్గించాలని రిటైల్ వ్యాపారులు వినతిపత్రం అందజేశారు. అదనపు సంచాలకుడు పీ రవికుమార్, ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు ఉప్పుల శ్రీనివాస్, ప్రాంతీయ ఉప సంచాలకుడు వీ పద్మావతి, హనుమకొండ డీఎంవో కే సురేఖ, ఎనుమాముల మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి పోలెపాక నిర్మల, చాంబర్ అధ్యక్ష కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, వేదప్రకాశ్ పాల్గొన్నారు.