రాయపర్తి, నవంబర్ 22 : వరంగల్ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దోపిడీ ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. భారీ దొంగతనం జరిగి నాలుగు రోజులైనా ఎలాంటి ఆధారాలు లభించకపోవడం వారి కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. దొంగల వేటలో పోలీసులు బిజీబిజీగా ఉండగా, బ్యాంకు లో తాము దాచుకొన్న బంగారం ఉందో.. పోయిం దో తెలియక ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల18న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆక్సిజన్ సిలిండర్, 5 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, జోకర్ అగ్గిపెట్టెలతో బ్యాంకులోకి ప్రవేశించి, సీసీ కెమెరాలు, అత్యవసర అలారాన్ని ధ్వంసం చేశారు.
సీసీ టీవీ పుటేజీ డీవీఆర్‌లతోపాటు బ్యాంకులోని లాకర్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి సుమారు 19 కిలోలకు పైగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ నెల 20న వరంగల్ జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి సభ ఉండడంతో బందోబస్తులో ఉన్న పోలీసులు, మ రుసటి రోజు రంగంలోకి దిగారు. జిల్లా పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్‌ఝాతోపాటు వెస్ట్, ఈస్ట్, సెంట్రల్ జోన్ డీసీపీలు రాజమహేంద్రనాయక్, రవీందర్, మహ్మద్ సలీమా బ్యాంకును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాధ్యమైనంత తొందరగా దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
వర్ధన్నపేట సబ్ డివిజన్లోని రాయపర్తి, వర్ధన్నపేట, జఫర్ఘడ్, కొడకండ్ల, పాలకుర్తి, దేవరుప్పుల పోలీస్ అధికారులతోపాటు కమిషనరేట్ పరిధిలోని రఘునాథపల్లి, చిల్పూరు, పర్వతగిరి, నర్సంపేట, సీసీఎస్, క్రైం బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్ అధికారులతో 10 బృందాలను ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో సుమారు 15 మంది ఎస్సైలు, 10 మంది సీఐలు, ముగ్గురు ఏసీపీలతోపాటు డీసీపీ భాగస్వాములైనట్లు తెలుస్తున్నది. దొంగల ముఠాను పట్టుకునే క్రమంలో కర్నాటక రాష్ర్టానికి చెందిన పలువురు పోలీస్ అధికారుల సహకారం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
బ్యాంకు దొంగతనానికి వచ్చిన దొంగల ముఠా తమ పని కానిచ్చేసి, దొంగతనానికి వినియోగించిన ఆక్సిజన్ సిలిండర్, 5 కేజీల ఎల్పీజీ సిలిండర్, గ్యాస్ కట్టర్ మిషన్లు, జోకర్ కంపెనీకి చెందిన అగ్గిపెట్టెను అక్కడే వదిలి వెళ్లినట్లు తెలిసింది. దీంతో జోకర్ అగ్గిపెట్టె తయారీతోపాటు విరివిగా వినియోగించే కర్నాటక రాష్ర్టానికి చెందిన వారే దొంగతనానికి పాల్పడి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు ఆ రాష్ట్రంలోనూ గాలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా, బ్యాంకులో తాము దాచుకొన్న బంగారం ఉందో.. పోయిందో.. అని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. తమను కనీసం లోపలికి కూడా అనుమతించడం లేదని బంగారం తనఖా పెట్టి రుణాలు తీసుకున్న వారు బ్యాంకు వద్దే పడిగాపులు పడుతున్నారు.