రేగొండ/కురవి, నవంబర్ 15 : కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని రేగొండ మండలంలోని తిరుమలగిరి పాండవుల గుట్టలపై శుక్రవారం బుగులోని జాతర వైభవంగా ప్రారంభమైంది. జిల్లాతో పా టు ఇతర ప్రాంతాల నుంచి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మూడు రోజల పాటు ఇక్కడే ఉంటూ ఉత్సవాలను తిలకిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే వేంకటేశ్వరస్వామికి ఏనుగు, మేక లు, ప్రభబండ్లు తయారు చేసి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కురవి మండలంలోని కందికొండ శివారు గుట్టపై లక్ష్మీనర్సింహస్వామి జాతర శుక్రవారం కనులపండువగా జరిగింది. భక్తజనంతో కందగిరి క్షేత్రం కిటకిటలాడింది. అర్చకులు అర్చకులు శుక్రవారం రాత్రి స్వామి వారి కల్యాణం వేదమంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా నిర్వహించగా గోవింద నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. నడిచే దాటరి లేకపోయినా ఎత్తైన గుట్టలను అవలీలగా ఎక్కుతూ స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. అలుపుసొలుపు లేకుండా భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయత్వం పొందారు.