హనుమకొండ చౌరస్తా, జనవరి 7: స్పౌజ్ బదిలీల్లో జాప్యం కారణంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల్లో నిరాశ నెలకొంది. జీవో 317 అమలులో భాగంగా భార్యాభర్తలైన ఉపాధ్యాయులను వేర్వేరు జిల్లాలు, జోన్లకు కేటాయించి మూడేళ్లు గడిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్పౌజ్ బదిలీలు పూర్తి చేస్తామన్న హామీ అమలు కోసం ఉపాధ్యాయులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు ఇల్లు, పిల్లలు, వృద్ధులైన అత్తమామలు, తల్లిదండ్రులను వదిలి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయలేక శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ముగిసిన తర్వాత ఏర్పడిన ఖాళీలను 13 జిల్లాల్లోని ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టి భర్తీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిం ది. 317 జీవోతో స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేసే ఉద్దేశంతో మంత్రివర్గ ఉప సం ఘాన్ని ఏర్పాటు చేయడంతోపాటు 2001 జనవరి లో దరఖాస్తు చేసుకున్న స్పౌజ్ ఉపాధ్యాయులను కూడా మరలా ఐప్లె చేసుకోవాలని సూచించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చి ఏడాదిగా ఎదురుచూపులు తప్పలేదు. చివరికి మంత్రివర్గం స్పౌజ్, మెడికల్ బదిలీలకు సానుకూలత వ్యక్తం చేసింది. తదుపరి జీవో 243 ప్రకారం స్ఫౌజ్ బదిలీల ప్రక్రియ ప్రారంభించి డిసెంబర్ మాసాంతానికి పూర్తి చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శాసనమండలిలో ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివిధ శాఖల్లో స్పౌజ్, మెడికల్ బదిలీల ప్రక్రియ స్థితిని జనవరి 4లోగా తెలపాలని జారీ చేసిన నోట్‌కు కాలపరిమితి మించిపోయింది. దీంతో స్పౌజ్ బదిలీలు ఏ కారణం చేత ఆగిపోయాయో తెలియక ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతుతున్నారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే తమ బదిలీలు ఎకడ ఆగుతాయోనని ఆవేదన చెందుతున్నారు. ఇదివరకే ప్రమోషన్లు అనంత రం చేపట్టాల్సిన ఈ బదిలీల ప్రక్రియ కొత్త ఉపాధ్యాయుల నియామకం కారణంగా ఆగిపోయింది. జనవరి 10లోగానైనా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. స్పౌజ్ బదిలీ జరగని పక్షంలో కనీసం మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం ఉంటుందనుకుంటే అధికారులు ఎలాంటి నిర్ణయా న్ని ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేస్తున్నారు.