డోర్నకల్, ఏప్రిల్ 21 : క్రీడా ప్రాంగణలు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడంతో ఆట స్థలాలకు ఆదరణ కరువైంది. లక్షల రూపాయల నిధులు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామానికో తెలంగాణ క్రీడాప్రాంగణాన్ని నిర్మించింది. ఒక్కో ప్రాంగణానికి సుమారు రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేసింది. క్రీడా సామగ్రిని కూడా ప్రభుత్వమే సమకూర్చింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడిన ఈ ప్రాంగణాలు ప్రస్తుతం కళా విహీనంగా తయారయ్యాయి. కొన్ని క్రీడాప్రాంగణాలకు బోర్డులు కూడా లేవు. జిల్లాలోని 461 పాత గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాల పరిస్థితి ఇలాగే ఉన్నది. పంచాయతీ కార్యదర్శులు, మండల అధికారుల పర్యవేక్షణ లేక పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం, రాళ్లు, రప్పలతో నిండిపోయాయి. మందుబాబులు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి. లక్షల రూపాయల ప్రజాధనం వృథాగా పోతున్నది.
క్రీడల్లో గ్రామీణ యువత రాణించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరం విస్తీర్ణణలో క్రీడా ప్రాంగణం నిర్మించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో క్రీడా ప్రాంగణాలు పట్టించుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు కనుమరుగవుతుండడంతో క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేసి క్రీడాకారులకు అందించాలని గ్రామీణ ప్రాంతం పూర్వ క్రీడాకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వసతులు కల్పించాలి
క్రీడాప్రాంగణంలో వసతులు కల్పించాలి. గ్రామీణ క్రీడాకారులు ఆడుకునేందుకు స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందించాలి. గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం పూర్వ వైభవం తేవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించింది.
– పగడాల నిఖిల్, ఖోఖో క్రీడాకారుడు, తోడేళ్లగూడెం