నర్సింహులపేట మే 19: విధి వెకిరించింది. రెకాడితే గాని డొకాడని కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. తల్లి ఊపిరితిత్తుల (లంగ్స్) వ్యాధితో మృతి చెందింది. ఓ వైపు ఆమెను కాపాడుకుంటున్న సమయంలో 28 ఏళ్ల కుమారుడికి కిడ్నీ వ్యాధి సోకడంతో వైద్య ఖర్చులకు చిల్లిగవ్వ లేక ఆపన్నహస్తం కోసం ఎదు రు చూస్తున్నది ఆ కుటుంబం. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కొమ్ములవంచ గ్రామానికి చెందిన తాళ్ల ప్రమీల- సోమన్నకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కూలీకి పోతేనే పూట గడుస్తుంది. అంతా సాఫీగా సాగుతున్న కుటుంబంలో పిడుగులాంటి వార్త వినిపించింది. ప్రమీలకు ఊపిరితిత్తుల(లంగ్స్) వ్యాధి సోకింది. నాలుగేళ్లపాటు చికిత్స కోసం కుటుంబమంతా కష్టపడి సుమారు రూ. 8లక్షల వరకు ఖర్చు చేసి వైద్యం చేయించారు.
అయినా ప్రమీల ఆరోగ్యం రోజురోజుకూ మరింత క్షీణిస్తున్న సమయంలో మరో కష్టం వచ్చి పడింది. 28 ఏళ్ల కుమారుడు సతీశ్‌కు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఖమ్మం జిల్లా కేంద్రంలో వైద్యం చేయించుకున్నా నయం కాక పోగా కిడ్నీలు దెబ్బతినడంతో (డయాలసిస్) మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో చేర్పించారు. అక్కడ చికిత్స చేయించుకుంటున్న సమయంలో ఈనెల 9న ప్రమీల అనారోగ్యంతో మృతి చెందింది. తల్లి చనిపోయిన బాధ ఓ వైపు.. తన ఆరోగ్యం కోసం డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు మరోవైపు.. నాలుగు నెలలుగా సతీశ్‌కు రూ.6లక్షల వరకు వైద్యం కోసం ఖర్చు చేశారు.
ఇప్పటికీ నిమ్స్‌లో రోజూ రెండు ఇంజెక్షన్లకు రూ.12 వేలు, ఇతర మందులకు రూ. 8 వేల వరకు ఖర్చు అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వారు రూ.35 వేల వరకు ఆర్థిక సాయం చేశారు. కొడుకును ఎలాగైనా బతికించుకోవాలనే తపనతో ఉన్నదంతా ఖర్చు పెట్టి మరీ వైద్యం చేయిస్తున్నారు. రోజుకు రూ.20 వేలకు పైగా ఖర్చవుతున్నదని, తమ శక్తి సరిపోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని, దాతలు ముందుకు వచ్చి సాయం చేసి తన కొడుకును కాపాడాలని తండ్రి సోమన్న వేడుకుంటున్నాడు. సాయం చేయాలనుకునే వారు ఫోన్‌పే 9505674125 లేదా, గూగుల్‌పే 7569042894 నంబర్లకు డబ్బులు పంపించాలని కోరుతున్నారు.