వరంగల్ చౌరస్తా: వరంగల్ నగరంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో మామపై ఓ అల్లుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం జరిగిన పెనుగులాటలో కిందపడిన కత్తి తీసుకుని మామ కూడా ఎదురుదాడి చేశాడు. ఈ ఘటనలో మామాఅల్లుళ్లు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
మట్టేవాడ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట ప్రాంతానికి చెందిన గున్నాల ప్రభాకర్ (52) వరంగల్ వ్యవసాయ మార్కెట్లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. మంగళవారం ప్రభాకర్ అల్లుడు వాకేటి అనిల్ కుమార్ ఇంటికొచ్చాడు. మద్యం మత్తులో మంగళవారం రాత్రి సమయంలో ప్రభాకర్తో అనిల్ కుమార్ గొడవపడ్డాడు. అంతటితో ఆగకుండా కత్తితో దాడి చేశాడు. తన అల్లుడు చంపేస్తాడేమో అన్న భయంలో.. ఆత్మరక్షణ కోసం అతన్ని ప్రభాకర్ నిలువరించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ప్రభాకర్ కిందపడిన కత్తి తీసుకుని అల్లుడిపై ఎదురుదాడి చేశాడు.
ఈ ఘటనలో మామాఅల్లుళ్లు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువురిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.