ఖిలావరంగల్ : పింఛన్ ఇప్పిస్తానని నమ్మించిన కన్నతల్లిని మోసం చేశాడు ఓ ఘనుడు. ఆమెకు వారసత్వంగా వస్తున్న భూమిని కాజేసి తన భార్య పేరు మీదకు పట్టా మార్పించుకున్నాడు. ఇద్దరు తోడబుట్టిన వాళ్లకు తెలియకుండా రెండో కొడుకు మోసం చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఆ తల్లి అదనపు కలెక్టర్‌ను ఆశ్రయించింది. తన భూమిని తన పేరు మీద తిరిగి పట్ట చేపించాలని కన్నీటి పర్యంతమైంది. ఈ ఈ హృదయ విదారక ఘటన వరంగల్ కలెక్టరేట్లో సోమవారం వెలుగు చూసింది.
నల్లబెల్లి మండలం రుద్రగూడెంకు చెందిన బాధితురాలు లద్దునూరు సూరమ్మ (72) తెలిపిన కథనం ప్రకారం..తన భర్త రాజయ్య చనిపోయిన తర్వాత వారసత్వంగా రుద్రగూడెం శివారులో ఎకరం 10 గుంటలు భూమి తన పేరు మీద పట్టా పాస్ బుక్ చేపించుకున్నాను. తనకున్న ముగ్గురు కుమారులలో రెండో కొడుకు కానిస్టేబుల్ యుగంధర్ వితంతు పింఛన్ ఇప్పిస్తానంటే ఆశతో కొడుకు మీద ఉన్న నమ్మకంతో అన్ని పత్రాలపై సంతకాలు పెట్టినట్లు ఆమె తెలిపారు.
తోడబుట్టిన వారికి హక్కు ఉంటుందని తెలిసి వాళ్లకు తెలియకుండా మోసంతో తన భార్య పేరు మీద భూమిని పట్టా చేపించుకున్నాడు. పింఛన్ వస్తుందంటే ఆశతో వెళ్లాను గాని నా భూమిని కాజేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదని అధికారుల ముందు కంటతడి పెట్టింది. చట్టబద్ధంగా చూస్తే మరో ఇద్దరి కుమారులు కూడా భూమిపై హక్కు ఉంది కాబట్టి తన కొడుకు చేసిన మోసంపై విచారణ చేపట్టి వారసత్వంగా వస్తున్న భూమిని తిరిగి తన పేరు మీదికి పట్టా మార్చాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది.