ఖిలావరంగల్, నవంబర్ 18: వరంగల్ నగరంలోని లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్లో జరుగుతున్న దోపిడీని అరికట్టి రైతుల పంటలకు సరైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిసి మార్కెట్ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన కూరగాయల పంటలను మార్కెట్‌కు తీసుకొస్తే, వ్యాపారులు మార్కెట్ బైలాకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వ్యాపారులే సొంత ఖర్చులకు ఏదో ఒక సందర్భంలో టెండర్ అనే విధానాన్ని వారికే వారే ప్రకటించుకుని, ఆ రోజు రైతులు తెచ్చిన పంటలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, దీని వలన మార్కెట్‌కు వచ్చే ఆదాయంతో పాటు, రైతులకు వచ్చే ఆదాయాన్ని కూడా కొల్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
2023 లోనే తమ సంఘం ఉన్నత అధికారులకు తెలియజేయగా, ఈ టెండర్ విధానాన్ని రద్దు చేయడం జరిగిందనీ. అయినప్పటికీ, ఈ మధ్యకాలంలో మళ్లీ వ్యాపారస్తులు కూరగాయల మార్కెట్లో టెండర్ అనే విధంగా వారికి వారే ప్రకటించుకుని, రైతులకు తక్కువ ధర చెల్లిస్తూ వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని అదనపు కలెక్టర్ కు వివరించారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మార్కెట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. టెండర్ విధానాన్ని పాటించిన వ్యాపారుల లైసెన్సులను రద్దు రద్దుచేసి టెండర్లో వచ్చిన లక్షల రూపాయలను మార్కెట్ కార్యాలయానికి జమ చేయాలన్నారు. మార్కెట్లో రైతుల పంటను స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశాలు రైతులకు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా ఉపాధ్యక్షులు ఊరటి హంసల్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బల్లు ఎల్లయ్య, రవీందర్ రాజు పాల్గొన్నారు.