సుబేదారి, మే 27 : కొందరు రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్‌తోపాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడుతూ అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వీరి ఆగడాలను కట్టడి చేసి, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వారికే వంతపాడుతున్నారు. సెటిల్మెంట్లలో నీకింత.. నాకింత అంటూ వాటాలు పంచుకుంటున్నారు.
ఇలాంటి కరుడు కట్టిన నేరస్తులపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి, స్టేషన్లకు పిలించి కౌన్సెలింగ్ ఇచ్చి, వారిలో సత్ప్రవర్తన తీసుకురావాల్సిన పోలీసులు వారికి మినహాయింపు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 742 రౌడీషీటర్లున్నారు. ప్రధానంగా వరంగల్ నగరంలోని మట్టెవాడ, మిల్స్‌కాలనీ, హనుమకొండ, కేయూ, సుబేదారి, కాజీపేట, మడికొండ, హసన్‌పర్తి పోలీసుస్టేషన్ల పరిధిలో కరుడు కట్టిన నేరస్తులు పోలీసుల టార్చర్ భరించలేక రాజకీయ రంగు పులుముకొని, అధికార పార్టీలో ఉన్న కొంతమంది లీడర్ల సపోర్ట్‌తో ఖద్దర్ రౌడీ లీడర్లుగా చలామణి అవుతున్నారు.
మరికొందరు తమ గాడ్ఫాదర్ల అండదండతో దందాలకు పాల్పడుతున్నారు. అలాగే వరంగల్ నగరంతో పాటు నర్సంపేట, పరకాల, జనగామ, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలో కరుడుగట్టిన నేరస్తులుగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన రౌడీ షీటర్లు రాజకీయ ముసుగు వేసుకొని చేస్తున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఎలాంటి దృష్టి పెట్టకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా వరంగల్ నగరంలో అధికార ప్రజాప్రతినిధుల సపోర్ట్‌తో సుమారు 15 మంది కరుడుగట్టిన నేరస్తులు, రౌడీ షీటర్లు లీడర్ల పేరుతో అమాయక యూత్‌ను మద్యం, డబ్బులతో చేరదీసి భూ కబ్జాలు, ఆర్థిక లావాదేవీల సెటిల్మెంట్లకు ఉసిగొల్పుతున్నారు.
ఇలాంటి వారి కదిలికలపై నిఘా పెట్టాల్సిన పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు నిర్వహించే సమీక్షల్లో రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్తులపై ఉక్కుపాదం మోపాలని పదే పదే కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినా ఏ ఒక్క పోలీసు అధికారి వారిని టచ్ కూడా చేయడం లేదు. కానీ, తెలిసీ తెలియక, క్షణికావేశంలో నేరాలకు పాల్పడి, పోలీస్ రికార్డుల్లో రౌడీ షీటర్లుగా ముద్ర పడి, చేసిన తప్పునకు శిక్ష అనుభవించి.. ఏదో వృత్తి పనిచేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న వారినే పోలీసులు వేధిస్తున్నారు.
వీరినే లోకల్ పోలీసులు నిత్యం కౌన్సెలింగ్ పేరుతో స్టేషన్‌కు పిలిపించి వార్నింగ్ ఇస్తున్నారు తప్ప పొలిటికల్ సపోర్ట్‌తో నిత్యం నేరాలకు పాల్పడుతున్న వారిని పట్టించుకోవడం లేదు. కనీసం కౌన్సెలింగ్‌కు కూడా పిలవడం లేదు. కొందరు ఇన్స్పెక్టర్లు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న రౌడీషీటర్లు స్టేషన్‌కు వస్తే దర్జాగా కుర్చీలు వేసి రాచమర్యాదలు చేస్తున్నారు. వారి ఫిర్యాదులు, సెటిల్మెంట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక నైట్ పెట్రోలింగ్‌లో లోకల్ ఇన్స్పెక్టర్, ఎస్సైలు రౌడీ లీడర్లుగా చలామణి అవుతున్న రౌడీ షీటర్ల ఇండ్ల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూ కబ్జాలు, సెటిల్మెంట్లుకు పాల్పడుతున్న పొలిటికల్ రౌడీ షీటర్ల దందాలు, ఆగడాలకు పోలీస్ ఉన్నతాధికారులు చెక్ పెట్టాలని కమిషనరేట్ ప్రజలు కోరుతున్నారు.