నల్లబెల్లి, జనవరి 12: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లె గ్రామ పంచాయతీ పరిధి గోవిందాపూర్ గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 31లోగల పెద్దబోడు గుట్టకు కొందరు ఎసరు పెడుతున్నారు. ఈ గుట్టకు సంబంధించిన పదెకరాల భూమి ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఈ భూమిలో కొంతమంది మట్టి వ్యాపారులు రాత్రి వేళ జేసీబీలతో మట్టిని తవ్వి ఒక్కో టిప్పర్‌కు రూ.7 వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మట్టిని తొలగించిన స్థలాన్ని కొందరు రైతులు పొలం మడులుగా తయారు చేసి యాసంగి వరి నాట్లు వేశారు. అ లాగే మరికొంత మంది భూమిని సేద్యానికి సిద్ధం చేస్తున్నారు. గుట్టను విధ్వంసం చేస్తున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్ స్పందించి ఆక్రమణకు గురవుతున్న పెద్దబోడు గుట్ట భూములను సర్వే చేపట్టి రక్షించాలని ఏజెన్సీ గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.
సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తాం
ప్రభుత్వ భూ ముల ఆక్రమణలకు పాల్పడుతు న్న వారిని ఉపేక్షించబోం. పెద్దబోడు గుట్టను విధ్వంసం చేస్తూ మట్టిని తరలిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తాం. అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి విక్రయాలు చేపడితే వాహనాలను సీజ్ చేస్తాం.
– ముప్పు కృష్ణ, తహసీల్దార్, నల్లబెల్లి