సుబేదారి, మే 29: గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా పందికుంట గ్రామానికి చెందిన చెక్క కుమారస్వామి జీవనోపాధికోసం కారు కొనుగోలు చేసి కిరాయిలకు నడుపుకునేవాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కుమారస్వామి ఎనిమిదేళ్లుగా ఒడిశా రాష్ట్రంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఇతర రాష్ర్టాల్లో ఎక్కువ ధరకు విక్రయించేవాడు.
ఈక్రమంలో పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చాడు. ఒడిశా రాష్ర్టానికి చెందిన గణేశ్ అలియాస్ గన్ను వద్ద రూ.24 లక్షల విలువైన 120 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. వాటిని రెండు కిలోల చొప్పున ప్యాకెట్లుగా మార్చి తన కారులో రహస్యంగా భద్రపరిచి దుప్పటి చింటు సహకారంతో ఏటూరునాగారం ద్వారా వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నాడు. టాస్క్‌ఫోర్స్, ఆత్మకూర్ పోలీసులు కటాక్షపూర్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కుమారస్వామి పట్టుబడ్డాడు. కారు డ్రైవర్ దుప్పటి మోహన్ పరార్ అయ్యాడు. 120 కిలోల గంజాయితోపాటు కారును స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ చూపిన టాస్క్‌ఫోర్స్ ఏసీపీ జితేందర్‌రెడ్డి ,ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్‌రావు, జనార్ధన్‌రెడ్డి, ఎస్సైలు శరత్‌కుమార్, లవన్‌కుమార్, నిస్సార్‌పాషా, ఆత్మకూర్ పోలీసులను ఆయన అభినందించారు.