హైదారబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : టీజీఎస్పీడీసీఎల్లో అవినీతి ఇంజినీర్లపై వేటుపడింది. గురువారం ఒకేసారి 8 మంది ఇంజినీరింగ్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌కు గురైన వారిలో ఏడీఈలు, ఏఈలు, సబ్‌ఇంజినీర్లు ఉన్నారు. యాంటీబ్రైబరీ సెల్‌కు వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టగా కొత్త కనెక్షన్లు, ప్యానల్ బోర్డుల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల మంజూరు వంటి పనులకు విద్యుత్తు ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్టు వెల్లడైంది. ఫోన్‌పే వంటి డిజిటల్ పేమెంట్ల ద్వారా లంచాలు స్వీకరించినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి.
ఎస్పీడీసీఎల్ అధికారుల్లో కొందరి అవినీతి తారస్థాయికి చేరింది. ముడుపులిస్తేనే పనులు జరుగుతాయంటుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అవినీతి బాగోతాన్ని గతంలో ‘నమస్తే తెలంగాణ’ పలుమార్లు వెలుగులోకి తెచ్చింది. మరోవైపు యాంటీబ్రైబరీ సెల్‌కు వచ్చిన ఫిర్యాదులనూ పరిగణనలోకి తీసుకున్న విజిలెన్స్ విభాగం అవినీతి అధికారులపై విచారణ మొదలుపెట్టింది. ఇందులో భువనగిరి ఏడీఈ, ఈవీ చార్జింగ్ స్టేషన్ల పవర్ సప్లయ్ కోసం ఒక వినియోగదారుడి నుంచి కొంత డబ్బు డిమాండ్ చేసి అందులో నుంచి రూ.5 వేలు తన ఫోన్‌పేకు పంపాలని చెప్పడం తో ఆ వినియోగదారుడు ఫోన్‌పే ద్వారా పంపించాడు. ఈ రసీదు ఆధారంగా ఆనంద్రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. గద్వాలకు చెందిన చిన్నసుబ్బారాయుడు రూ.25వేలు లంచం తీసుకోగా, చౌటుప్పల్ లైన్‌మన్ రూ.45వేలు లంచం తీసుకున్నాడని, ఇలా డిస్కమ్‌లో 8 మంది వివిధ రకాలుగా లంచాలు తీసుకోవడంపై విజిలెన్స్ ఆధారాలు సేకరించింది. డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆదేశాల మేరకు సదరు అధికారులపై చర్యలు తీసుకున్నారు.
సస్పెండయిన వారిలో యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన ఆపరేషన్స్ ఏడీఈ ఆర్ ఆనందరెడ్డి, గద్వాల జిల్లా శాంతినగర్‌కు చెందిన ఆపరేషన్స్ ఏఈ చిన్నసుబ్బారాయుడు, మేడ్చల్ జిల్లా భాగ్యనగర్ సెక్షన్‌కు చెందిన ఆపరేషన్ ఏఈ షహబాజ్ అహ్మద్, సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి సర్కిల్ కమర్షియల్ సెక్షన్‌కు చెందిన సబ్ ఇంజినీర్ మధుసూదన్, యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన లైన్‌మన్ జిల్లపల్లి శ్రీనివాస్, గద్వాల్ జిల్లా అల్వాల్‌పాడ్ లైన్‌మన్ షేక్ షావలీ, సైబర్‌సిటీ జుంటుపల్లికి చెందిన లైన్‌మన్ డప్పు అంజయ్య, హైదరాబాద్ సౌత్ సర్కిల్ మలక్‌పేట సెక్షన్‌కు చెందిన ఆర్టిజన్ గ్రేడ్-3 ఎండీ ఖలీద్ ఉన్నారు.
ప్రస్తుతం సస్పెన్షన్‌కు గురైన సిబ్బందితోపాటు మరో 56 మందిపై కూడా వేటువేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇటీవల ఓసీ విషయంలో డిస్కమ్ విధించిన నిబంధనల కారణంగా చాలామందికి ఓసీలు లేక కనెక్షన్లు ఇవ్వడం లేదు. దీంతోపాటు సీఈఐజీ అప్రూవల్స్ కూడా చాలావరకు పెండింగ్ ఉండేది. వీటి విషయంలో నకిలీ ఓసీలు, ఫోర్జరీ అప్రూవల్స్‌తో కొందరు కాంట్రాక్టర్లు చేసిన పనికి సహకరించిన విద్యుత్తు అధికారులపై వేటు వేసే దిశగా డిస్కమ్ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 36 మందికి సంబంధించిన జాబితా డిస్కమ్‌లో సిద్ధం కాగా, మరో 20 మందిపై ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ 56 మంది ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ ఓసీలు, ఇతర అక్రమాలకు పాల్పడినట్టుగా విజిలెన్స్ విచారణలో తేలింది. మరోవైపు నగరశివారులోని ముఖ్య సర్కిళ్లలో ఫోకల్ పోస్టుల్లో పనిచేస్తున్న కొందరు తీసుకున్న లంచాల చిట్టా విజిలెన్స్ చేతికి చేరింది. విజిలెన్స్ అధికారులు వారిపై చర్యలకు సీఎండీకి సిఫారసు చేశారు. వీరంతా క్యాటగిరీని బట్టి మీటర్‌కు రూ.5వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. వీరిపై కూడా ఆధారాలు సేకరించి జాబితా రూపొందించే పనిలో విజిలెన్స్ నిమగ్నమైంది.