హనుమకొండ, జూలై 10 : ఇక నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు రేవంత్‌రెడ్డి లాంటి సీఎంను తాను చూడలేదన్నారు. మాట మా ర్చడం, మడమ తిప్పడం, ఏమార్చడమే ఆయన నీతి, రీతిగా మారిందన్నారు. అభివృద్ధి, రాష్ట్ర గౌర వం పెంచేందుకు ప్రజలు ఎన్నుకొంటే సీఎం మాట లు మాత్రం ఎదుటి వారిని చులకన చేసే విధంగా ఉన్నాయన్నారు.
రేవంత్‌రెడ్డి మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా కనిపిస్తున్నాడని పేర్కొన్నారు. సీఎం చాలెంజ్‌ను స్వీకరించిన కేటీఆర్‌తోపాటు తామంతా ప్రెస్‌క్లబ్‌కు వస్తే, నేను క్లబ్‌లు, పబ్‌లకు రానంటూ దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. అధికారం కోసం పార్టీల ఫిరాయింపును నిర్విరామంగా కొనసాగించిన సమయంలో అదే క్లబ్లో అనేకసార్లు చర్చల్లో పాల్గొన్న విషయాలను రేవంత్‌రెడ్డి మర్చిపోయినట్లున్నాడని ఎద్దేవా చేశారు.
ప్రెస్‌క్లబ్ అనేది ప్రజల వాణిని వినిపించి, సమస్యలపై చర్చించడంతో పాటు వాస్తవాలను సమాజానికి తెలిపేదని, దానిని వక్రీకరించి సీఎం మాట్లాడడం అంటే అందరినీ కించిపరిచినట్లేనని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముమ్మాటికి సీఎంది పలాయనవాదమన్నారు. ప్ర జా సమస్యలను చర్చించేందుకు ఏడాదిలో వంద రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని ఆయన సీఎంను డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, తాను రాజీనామా చేయడంతోనే మేడం తెలంగాణ ఇచ్చిందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన డం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ లేకుంటే రాష్ట్రం వచ్చేది కాదన్నారు. సీఎం ఢిల్లీ ప్రదర్శనలు చేస్తూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి, రైతుల కోసం బీఆర్ఎస్ సర్కారు అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఆస్ప్రతుల్లో మందులకు కట కట ఏర్పడిందని మధుసూదనాచారి అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వమే ఉచితంగా షుగర్, బీపీ తదితర మందులు సరఫరా చేస్తుందని, తాము వెళ్లి అడిగితే లేవని అంటున్నారని తెలిపారు. ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో మందులు సరఫరా కావడం లేదని చెబుతున్నారని సిరికొండ తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేంద ర్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, చింతం సదానందం, మాజీ కార్పొరేటర్ జోరిక ర మేశ్, పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, నాయకులు నయీముద్దీన్, పోలపల్లి రా మ్మూర్తి, బొద్దె వెంకన్న, బైరపాక ప్రశాంత్, వీరస్వా మి, అనిల్, వినీల్ రావు, స్నేహిత్ పాల్గొన్నారు.