హనుమకొండ, ఫిబ్రవరి 13: బీసీలకు ఇచ్చిన హామీల విషయంలో ద్రోహం చేస్తే సహించబోమని శాసనమండలి పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మోసపూరిత, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కాస్కో.. కేసీఆర్ త్వరలోనే బయటకు రానున్నాడన్నారు. ఆయన మౌనం పర్యవసానం గురించి సీఎంలు చంద్రబాబు, వైఎస్సార్‌కు తెలుసని పేర్కొన్నారు. బీసీల సంక్షేమం కోసం నిబద్ధతతో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఆలోచన చేసి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేశారన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలన స్వర్ణయుగంలా వెలుగొందిందన్నారు.
కుల గణన విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం తీసుకొస్తారని అనుకుంటే తూతూమంత్రంగా ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. బీసీల అభ్యున్నతి, రాజకీయ ప్రాతినిధ్యంపై తాను వినయ్ భాస్కర్, మరికొందరితో కలిసి తమిళనాడు కు వెళ్లి అధ్యయనం చేశామని, అకడి ప్రభుత్వం స్థానిక సంస్థలు, ఉద్యోగాల్లో 62 శాతం బీసీలకు కేటాయిస్తున్నదన్నారు. లెకలు తప్పుగా చూపడంతో బీసీలకు కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాల్లో కోత విధిస్తుందని, వచ్చే నిధుల్లో అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కార్మిక, కర్షక, మహిళలు, విద్యారులు.. ఇలా ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేరన్నారు. శాసనసభ, శాసనమండలిలో తాము మాట్లాడే మాటలకు సీఎం, మంత్రులు తడబడుతున్నారని పేర్కొన్నారు.
గత పదేళ్లలో తెలంగాణలో చేపట్టిన వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెకించిందని విమర్శించారు. పరిపాలన చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇకడ కమీషన్లు తీసుకొని ఢిల్లీకి సంచులు మోసుకుపోవడం తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదన్నారు. కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం పదవి ఇకడున్న ప్రజల వల్లే వచ్చిందని, కానీ ఏ పార్టీ పచ్చగా ఉంటే ఆ పార్టీలోకి రేవంత్ రెడ్డి, శ్రీహరి చేరుతారన్నారు. దమ్ముంటే కడియం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని మధుసూదనాచారి అన్నారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, కార్పొరేటర్లు బోయినపల్లి రంజిత్‌రావు, బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, మాజీ కార్పొరేటర్లు జోరిక రమేశ్, కేశవబోయిన అరుణా శ్రవణ్‌కుమార్, మైనార్టీ నాయకులు నయీముద్దీన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లో ఎండగట్టాలి. ఆ పార్టీ నాయకులకు గట్టిగా గుణపాఠం వచ్చేలా బుద్ధి చెప్తాం. లగచర్ల రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడి విజయం సాధించింది. అంతేకాకుండా మన పోరాటంతోనే ప్రభు త్వం బీసీ కులగణన రీ సర్వేకు పూనుకుంది. కవులు, కళాకారులకు అందుబాటులో ఉండేలా కేసీఆర్, కేటీఆర్ సహకారంతో రూ. 90 కోట్ల నిధులతో కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తే, ఇప్పుడు వారు ఏదైనా కార్యక్రమం చేయాలంటే రూ. 1.50 లక్షలు తీసుకుంటున్నారు. వ్యాపార క్షేత్రంగా కాకుండా కవులు, కళాకారులకు అందుబాటులో ఫీజులు ఉండాలి. కళాకారులతో సమావేశం నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతాం. పార్టీ ప్రజలందరికి అండగా నిలుస్తుంది.
– దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే