ఎల్కతుర్తి, ఏప్రిల్ 20 : ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర వ్యతిరేక శక్తులతో సైతం జై తెలంగాణ అనిపించిన ఘనత కేసీఆర్‌ది అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుంచి ఒక్కరు చొప్పున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఎల్కతుర్తి సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ ఎల్కతుర్తి సభ చరిత్రాత్మకమైనదని, 14 ఏండ్ల ఉద్యమం తర్వాత పదేండ్లలో రాష్ర్టానికి కేసీఆర్ అద్భుత పాలనను అందించారని, తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా నిలబెట్టారన్నారు. కేసీఆర్ పిలుపునిస్తే బహిరంగ సభలకు ప్రజలు లక్షలాదిగా తరలివస్తారని, అందుకు ఆయనపై ఉన్న విశ్వాసమే కారణమన్నారు.
16 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూనే ఉందన్నారు. ఇది పూర్తిగా పర్సంటేజీల ప్రభుత్వమని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించడం కాంగ్రెస్ నైజమని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం ఏ వర్గానికీ న్యాయం చేయలేదని, రాష్ట్రంలో ఒక్కరు కూడా సంతోషంగా లేరని విమర్శించారు. తాను ఈ రోజు హుస్నాబాద్ నుంచి వస్తుంటే చెరువులన్నీ ఎండిపోయి కనిపించాయని, ఏడాదిన్నర క్రితం జలాశయాలు నీటితో కళకళలాడేవని గుర్తు చేశారు. ప్రపంచం మెచ్చుకునే రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తాగు, సాగు నీళ్లకు కొదువలేకుండా చేశారని, అద్భుతమైన పంటలు పండేలా చూశారన్నారు.
ఇప్పుడు కాళేశ్వరం నీళ్లను వాడుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో కరువు, కాటకాలు వచ్చే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రాతో హైదరాబాద్‌లో గందరగోళం సృష్టించారని, రాజధానితో రాష్ట్రంలోని ప్రతి ఊరికి సంబంధం ఉంటుందని వివరించారు. హెచ్‌సీయూలో దమనకాండను దేశం మొత్తం చూసిందని, కేసీఆర్ మొక్కలు నాటిస్తే, రేవంత్ విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి ముకుతాడు వేసేది ప్రజాశక్తే అని, ప్రజలకు అన్నీ చెప్పాల్సిన అవసరం ఉందని, మెడలు వంచడం, హామీలు అమలయ్యేలా చూడడం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బాధ్యతన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహం కలుగుతుంటే ప్రజల తరపున గొంతు విప్పడానికే కేసీఆర్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారని సిరికొండ చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం తదితరులున్నారు. అంతకుముందు సభా ప్రాంగణాన్ని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పరిశీలించి, ఆ నియోజకవర్గ ప్రజలకు కేటాయించిన పార్కింగ్ స్థలాలను చూసి వెళ్లారు.