Singareni | గణపురం, నవంబర్ 1 : బురద నీటితో నిండిన ఈ భూములు రైతులు సాగుచేసుకుంటున్న పంట పొలాలు. సింగరేణి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒండ్రు మట్టి నీరు చేరి పంటలు పనికి రాకుండా పోయాయి. దీంతో తమకు నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని శుక్రవారం బాధిత రైతులు అధికారులకు మొరపెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ధర్మారావుపేట రెవెన్యూ గ్రామ శివారులో సింగరేణి సంస్థ ఓసీ-3 గనిని నిర్వహిస్తున్నది. తవ్వకాల్లో భాగంగా తీసిన ఓవర్ బర్డెన్ (మట్టి)ని గని హద్దుల వెంట పోస్తున్నారు.
అయితే సింగరేణి సంస్థ గనికోసం కేటాయించిన భూముల హద్దుల వెంట ట్రెంచ్ (కాలువ) కొట్టాల్సి ఉంటుంది. ఈ పనులు చేయకుండానే మట్టిని గుట్టలుగా డంప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వచ్చిన వరద సింగరేణి పోసిన మట్టిని తీసుకొచ్చి ఈ పొలాల్లో వదలడంతో మిర్చి, మినుము తదితర పంటలు నేలమట్టమయ్యాయి.
నగరంపల్లి గ్రామానికి చెందిన రైతులు పండిస్తున్న ఇడబోయిన సంతోష్‌కు చెందిన మూడెకరాలు, గొర్రె నాగరాజు,కొడారి ధనుంజయ్ ఎకరం చొప్పున, ఇడబోయిన రవి 20 గుంటల్లో సాగు చేసిన మిర్చితో పాటు గొర్రె రవి మూడెకరాల్లో వేసిన మినుము, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చుట్టూ ట్రెంచ్ ఉంటే వర్షపు నీరంతా అందులోకి వెళ్లేది కాదని, సింగరేణి అధికారుల నిర్లక్ష్యం తమకు శాపంగా మారిందని రైతులు వాపోయారు. ప్రస్తుతం మిర్చి పంట పూత, పిందె స్థాయిలో ఉందని, బురద నీటితో పూర్తిస్థాయిలో నషం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్, ఆర్డీవో, సింగరేణి అధికారులకు వినతిపత్రం సమర్పించారు.