శాయంపేట, జూలై 2 : శాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ హనుమకొండ జిల్లా సహకార అధికారి (డీసీవో) వివరణ కోరా రు. ఈ మేరకు చైర్మన్‌తో పాటు 13 మంది డైరెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సొసైటీలో ఆర్థిక అసమతుల్యత పెరిగిందని, రూ. 10.54 కోట్లు ఇన్బ్యాలెన్స్గా ఉందని, దీనిని సరిచేసేందుకు చైర్మన్, పాలకవర్గం చర్యలు తీసుకోలేదని పేర్కొన్నా రు.
ప్రజలకు సేవ చేయడంలో పదేపదే విఫలమవుతున్న క్రమం లో నిర్లక్ష్యమే కారణంగా నిర్ధారించారు. సహకార చట్టం నిబంధనలు పాలకవర్గం పాటించలేదని తేల్చారు. తీవ్రమైన లోపాలు, నిర్లక్ష్యం, చట్టపరమైన ఉల్లంఘనలు సొసైటీలో పెరిగినట్లు గుర్తించారు. ఈ క్రమంలో సహకార చట్టం 1964లోని సెక్షన్ 34 ప్రకారం ప్రస్తుత పాలకవర్గాన్ని రద్దు చేయడానికి కారణాలున్నాయని ప్రాథమికంగా నిర్ధారించినట్లు డీసీవో నోటీసుల్లో పేర్కొన్నారు. అందువల్ల పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదో ఏడు రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
అది సంతృప్తికరంగా లేకపోతే సంఘం పాలకవర్గాన్ని రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటామని డీసీవో పేర్కొన్నారు. ఈ క్రమంలో పీఏసీఎస్ పాలకవర్గం సభ్యులు డీసీవోను కలిశారని, అభివృద్ధి విషయంలో ఆయన వారిని ప్రశ్నించగా ఎలాంటి సమాధానం రాలేదని తెలిసింది. ఇదిలా ఉండగా 2022-23, 2023-24లో యాసంగి, వానకాలం ధాన్యం వ్యాపారంలో ఖర్చులు ఎక్కువ చూపి అక్రమాలకు పాల్పడినట్లు ఆడిటర్ డీసీవోకు రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో రూ. 3 లక్షలు రికవరీకి గత ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేసినప్పటికీ పురోగతి లేదని తెలుస్తున్నది.
శాయంపేట పీఏసీఎస్ ఇన్చార్జి సీఈవోగా పనిచేస్తున్న పెరుగు శంకర్‌ను సస్పెండ్ చేస్తూ డీసీవో సంజీవరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దకోడెపాకకు చెందిన రైతు పృథ్వీరాజ్ రుణం తీసుకునేందుకు శంకర్‌కు వడ్డీ డబ్బులు చెల్లించారు. దాంతో పాటు మరికొంత నగదు చెల్లించినా రసీదు ఇవ్వకుండా ఇన్చార్జి సీఈవో వాడుకున్నాడని డీసీవోకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పృథ్వీరాజ్‌తో పాటు మరో ఇద్దరు రైతులు సొసైటీ ముందు ఆందోళన చేశారు. ఈ విషయమై విచారణ జరపాలని నోడల్ అధికారి రాధికను డీసీవో ఆదేశించడంతో ఆమె శంకర్ అవినీతిని నిర్ధారిస్తూ నివేదిక అందజేశారు. దీంతో శంకర్‌కు నోటీసులు జారీ చేయగా అతడిచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయనను సస్పెండ్ చేశారు. అలాగే సొసైటీలో అసిస్టెంట్ స్టాఫ్‌గా పనిచేస్తున్న లింగమూర్తికి ఇన్చార్జి సీఈవోగా బాధ్యతలు అప్పగించారు.