ఏటూరునాగారం, జూన్ 23 : ములుగు జిల్లాలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలను ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. భారీగా పోస్టులు ఖాళీగా ఉండడంతో తాము చదువుకునేదెట్లా? అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. భర్తీకి నోచుకోని పోస్టులు, సబ్జెక్టు టీచర్ల కొరతను అధిగమించేందుకు అధికారులు కుస్తీ పడుతున్నారు. డిప్యుటేషన్లతో సర్దుబాటు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇదిలా ఉండ గా ఏజెన్సీ డిప్యూటీ ఈవో, ఏసీఎంవో పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 23 గిరిజన ఆశ్రమ ఉన్నత, ఆరు ప్రాథమికోన్నత, 98 ప్రాథమిక పాఠశాలలతో పాటు రెండు జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలో ఆరు వేల మంది విద్యార్థులు చదువుతున్నట్లు సమాచారం.
వీటి పరిధిలో మొత్తంగా మంజూరైన పోస్టులు 568 కాగా 411 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 157 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో 319 ఎస్జీటీ కాగా మిగతావి వివిధ సబ్జెక్టులకు సంబంధించినవి ఉన్నాయి. ముఖ్యమైన సబ్జెక్టు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పోస్టులు కూడా కొద్ది కాలంగా భర్తీకి నోచుకోవడం లేదు. ఖాళీగా ఉన్న 157 పోస్టులకు కేవలం 52 మంది కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సీఆర్టీ)లను మాత్ర మే తీసుకొని విద్యా సంవత్సరాలు వెళ్లదీస్తున్నారు. పీజీ హెచ్ఎం పోస్టులు 21 కాగా, ఆరు ఖాళీగా ఉన్నాయి. 17 హాస్టల్ వెల్ఫేర్ పోస్టులకు ఐదు ఖాళీలున్నాయి.
22 తెలుగు పోస్టులకు 18 మంది టీచర్లుండగా హిందీలో 18కి 13, ఫిజికల్ సైన్సులో 19కి 11, సోషల్లో 25 కు 19, పీడీ పోస్టులు 18కి 13, ఆరు క్రాఫ్టు టీచర్లకు ఒక్కరు, ఐదు డ్రా యింగ్ పోస్టులకు ఒకటి, గ్రేడు-2 తెలుగు, హిందీ 18 చొప్పున ఉండగా 14 మంది చొప్పున ఉపాధ్యాయులున్నారు. ఇక పీఈటీ కూడా ఏడు పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. ఉన్న ఉపాధ్యాయులతో నిర్వహణ, బోధన చేయడం అసాధ్యం కావడంతో సీఆర్టీలను తీసుకుంటున్నారు. ఇక అప్గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలలకు ఉపాధ్యాయుల పోస్టులను ఇంకా మంజూరు చేయలేదు. ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొంది సంఖ్య తగ్గుతుం దే తప్ప భర్తీ మాత్రం కావడం లేదు. దీంతో ఉన్న ఉపాధ్యాయులను డిప్యుటేషన్లపై పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన విద్యార్థులకు అనుకున్న మేర ఉన్నత విద్య అందడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఖాళీగా ఉన్న 157 పోస్టుల్లో 52 మంది సీఆర్టీలను మాత్రమే విధుల్లోకి తీసుకున్నారు. దీంతో ఇంకా వందకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్ ఆశ్రమ పాఠశాలలో రెగ్యులర్ ఉపాధ్యాయుడు ఒక్కరే ఉన్నారు. ఇక ఏటూరునాగారంలోని బాలుర ఉన్నత పాఠశాలలో రెగ్యులర్ ఉపాధ్యాయులు లేరు. దీంతో ఏటూరునాగారంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని ఇక్కడకు తాత్కాలికంగా కేటాయించారు. ఇలా అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉండగా ఉన్న ఉపాధ్యాయులనే ఇన్చార్జి వార్డెన్లుగా నియమిస్తుంటారు. టెన్త్ పూర్తయ్యాక ఇంటర్మీడియట్చే చేరిన విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తున్నది.