‘హరహర మహాదేవ.. శంభోశంకర’.. ‘ఓం నమః శివాయః..’ అంటూ శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. ఉమ్మడి జిల్లా అంతటా శివరాత్రి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి వేలాది మంది భక్తులు శైవాలయాలకు పోటెత్తారు. పరమేశ్వరుడి దర్శనం కోసం క్యూలో బారులు తీరి కనిపించారు. రాత్రంతా జాగారం చేసి శివుని సేవలో తరించారు.
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం, రామప్ప రామలింగేశ్వరాలయం, హనుమకొండ వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వరాలయం, వరంగల్ కాశీబుగ్గ కాశీవిశ్వేశ్వరాలయం, స్వయంభూ శంభులింగేశ్వరాలయం, కోటిలింగాల, భట్టుపల్లి, పాలకుర్తి సోమేశ్వరాలయం, కురవి వీరభద్రస్వామి ఆలయం, కొడవటూరు సిద్ధేశ్వరాలయంతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆలయాల్లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహాపర్వదినం సందర్భంగా ఆలయాల్లో శివపార్వతుల కల్యాణాన్ని కనులపండువలా నిర్వహించగా భక్తులు తిలకించి తరించిపోయారు.
కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని సుమారు 2.20లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. పుణ్యస్నానాలు చేసేవారితో కాళేశ్వరంలో త్రివేణి సంగమం పులకించిపోయింది. వేయిస్తంభాల గుడిలో పునరుద్ధరించిన కల్యాణమండప ప్రారంభోత్సవం అట్టహాసంగా కొనసాగింది. ఆలయ ఆవరణల్లో జాగరణ చేసే భక్తుల కాలక్షేపం కోసం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.