హనుమకొండ, జూలై 8 : రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం గ్రేటర్ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 10.30 గంటలకు నిట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్‌కు చేరుకొని స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి, సభ్యులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ పిదప హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 1.20 గంటలకు ఆర్ట్స్ కాలేజీ వరకు నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ ర్యాలీని హనుమకొండ కలెక్టరేట్ వద్ద ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నిట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకొని విరామం తీసుకున్న అనంతరం మధ్యాహ్నం 3.35 గంటలకు రెడ్‌క్రాస్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత ములుగురోడ్డు పెద్దమ్మగడ్డలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హనుమకొండ బాలికల గిరిజన సంక్షేమ నివాస పాఠశాల (టీజీటీడబ్ల్యూఆర్) సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి నిట్ గెస్ట్ హౌస్‌కు చేరుకొని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.