శాయంపేటకు చెందిన దాసరి కల్పనకు అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా ఢిల్లీలో ఆదివారం జరిగే వేడుకల్లో పాల్గొననున్నది. అలాగే ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులతో ముఖాముఖిలో పాల్గొనే అవకాశం దక్కింది. కాగా రాష్ట్రంలో సెర్ప్ నుంచి హాజరవుతున్న ఏకైక మహిళా పారిశ్రామికవేత్త ఈమే కావడం విశేషం.
– శాయంపేట, జనవరి 25
హనుమకొండ జిల్లా శాయంపేట మండలకేంద్రంలోని సరస్వతి స్వయం సహాయక సంఘం నుంచి దాసరి కల్పన నేడు ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నది. కల్పన ఇంటర్మీడియట్ వరకు చదువుకోగా, ఈమెకు భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 2001 లో డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా కల్పన చేరి కుట్టుమిషన్ ద్వారా ఉపాధి పొందేవారు. ఈమె కు హిందీ భాషపై పట్టుండడంతో ఓరుగల్లు జిల్లా సమాఖ్య తరపున సీఆర్పీ ట్రైనింగ్‌కి ఎంపికయ్యా రు. 2016లో వంద రోజుల పాటు శిక్షణ తీసుకొని ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు వెళ్లి పనిచేశారు. ఒకోసారి కుటుంబాన్ని వదిలి 3 నెలల పాటు ఆమె డ్యూటీ చేసేది.
డ్వాక్రా సంఘాల మహిళలను లక్షధికారులుగా చేయడమే లక్ష్యంగా సెర్ప్ లఖ్పతిదీదీ కార్యక్రమాన్ని ప్రారంభించగా ఈ అవకాశాన్ని కల్పన అందిపుచ్చుకున్నారు. శాయంపేట మండ ల సమాఖ్య తరపున రూ.15 లక్షల రుణం తీసుకొని 2020లో నానో ఓవెన్ బ్యాగ్‌ల తయారీ పరిశ్రమ ప్రారంభించారు. తను సొంతంగా మరో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టి క్రమక్రమం గా ఉత్పత్తి పెంచుకుంటూ ఏడాదికి రూ.1.20 కోట్ల టర్నోవర్ సాధించారు. తనతో పాటు ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులకు ఉపాధి కల్పించి ఆదర్శంగా నిలిచారు.
నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాను. కుట్టుమిషన్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నా. నా ఇద్దరు కూతుర్లను వదిలేసి సీఆర్పీగా పనిచేయడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాను. అకడ కనీసం సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండేవి కావు. నా భర్త, పిల్లలతో కూడా మాట్లాడే అవకాశం దకేది కాదు. ఇంతలో లక్పతి దీదీ కార్యక్రమం ద్వారా నాకు గొప్ప అవకాశం దకింది. నానో ఓవెన్ బ్యాగ్ పరిశ్రమ స్థాపించి, వచ్చే ఆదాయంతో నా ఇద్దరు కూతుర్లను ఇంజినీరింగ్ చదివిస్తున్నాను. ఈ పరిశ్రమ నడపడంలో నా భర్త సహకారం మరువలేనిది. రాష్ట్రం నుంచి ఢిల్లీకి తనకు ఒక్కరికే అవకాశం దక్కడం అదృష్టం.
– దాసరి కల్పన, మహిళా పారిశ్రామిక వేత్త