వరంగల్,అక్టోబర్ 6 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం భద్రకాళీ అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ, సాయంత్రం హంస వాహనంపై ఊరేగారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం నిర్వహించిన సాం స్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కాళేశ్వరం : భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయంలోని శ్రీ పార్వతి, మహా సరస్వతి అమ్మవార్లు ఆదివారం కూష్మాండ అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ మేరకు ఉదయం గణపతి, లలితార్చన పూజలతో పాటు గణపతి, నవగ్రహ, రుద్ర పంచసూక్త హోమం, సాయంత్రం మూలమంత్ర చండీహోమం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.