మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 15 : మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 15 : మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని.. ఒకవేళ తనపై గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ సవాల్ విసిరారు. నియోజకవర్గం అంతటా ఎమెల్యేపై వ్యతిరేకత ఉన్నదని నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదని మురళీనాయక్‌ను ప్రజలు అడ్డుకున్నారన్నారు. శనివారం సేవాలాల్ జయంతి సందర్భంగా మహబూబాబాద్ శివారు అనంతారం వద్ద నిర్వహించిన వేడుకలకు శంకర్‌నాయక్ దంపతులు గిరిజనులతో కలిసి ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ దంపతులు ముందుగా ర్యాలీగా వెళ్తారని శంకర్‌నాయక్ ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో శంకర్‌నాయక్ వర్గీయులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొని ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొంత సమయం తర్వాత ఎమ్మెల్యే ర్యాలీ వెళ్లిన అనంతరం శంకర్‌నాయక్ ర్యాలీని పంపించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని, సేవాలాల్ బాటలో నడవాలన్నారు. కాగా గుడి వద్ద ఎలాంటి ఘర్షణ జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఉత్సవాల అనంతరం శంకర్‌నాయక్ విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సేవాలాల్ మహరాజ్ జయంతిని ఘనంగా నిర్వహించామన్నారు.
సబ్బండ వర్గాల పండుగలకు ప్రాధ్యానత ఇచ్చిందని, హిందువులకు బతుకమ్మ చీరలు, ముస్లింకు రంజాన్ కిట్లు, క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్‌లు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ మాయమయ్యాయని పండుగలకు ప్రాముఖ్యత లేకుండా చేసిందన్నారు. ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వీటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. రైతు రుణమాఫీ కాక, రైతుభరోసా అందక, తులం బంగారం, బోనస్ డబ్బుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని శంర్నాయక్ డిమాండ్ చేశారు.