వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 6 : గర్భస్థ పిండ లింగనిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అక్రమ పరీక్షలను అరికట్టాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలను గాలికొదిలేయడంతో స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు బరితెగిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే సెంటర్ల లైసెన్స్‌లను రద్దు చేయాల్సి ఉన్నా, ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కఠినమైన లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం అమలులో ఉన్నప్పటికీ, అధికారుల పర్యవేక్షణ లోపం, నిఘా వైఫల్యం కారణంగా కొన్ని ప్రైవేట్ సెంటర్లు గుట్టుచప్పుడు కాకుండా కాసుల వేటలో పడ్డాయి. దీంతో చట్టం కాగితాలకే పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా 104 స్కానింగ్ సెంటర్లకు 69 మాత్రమే సేవలందిస్తున్నాయి. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ, నిఘా ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రోగ్రాం అధికారులు సైతం ఇన్చార్జిగా మాత్రమే కొనసాగుతుండడంతో పర్యవేక్షణ, నిఘా, పరిశీలించడం కష్టతరంగా మారుతోంది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కనీస దృష్టి పెట్టకపోవడంతోనే నగరంలో ఇష్టారీతిన స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షల దందా కొనసాగుదతోందని పలువురు వైద్యులే చెబుతున్నారు.
ఇటీవల హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో గర్భిణికి లింగ నిర్ధారణ పరీక్షల్లో ఆడ శిశువుగా గుర్తించడంతో సదరు మహిళను భర్త స్విమ్మింగ్‌పూల్‌లో తోసి హత్య చేశాడు. అదేవిధంగా నర్సంపేట ప్రాంతంలోని వేద స్కానింగ్ సెంటర్లో బాలికకు గర్భిణి అని తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో దాడులకు పాల్పడిన ఘటనలు వైద్యాధికారుల వైఫల్యాలను బయటపెడుతున్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేసి, రికార్డులు పరిశీలించి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్కానింగ్ సెంటర్లపై గట్టి నిఘా, సరైన పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
పురుషులతో సమానంగా ఉండాల్సిన మహిళల జనాభా తగ్గుతున్న కారణంగా 1994లో లింగ నిర్ధారణ పరీక్షలను నివారించడానికి ప్రభుత్వం చట్టాన్ని రూపొందించి ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్ (పీసీపీఎన్డీటీ) విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం పరీక్షలు చేస్తున్న మహిళ పూర్తి వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలి, పిండం ఎదుగుదల పరీక్షలు మాత్రమే చేయాలి. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్ట ప్రకారం నేరస్తులుగా గుర్తించబడతారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు రుజువైతే ఆ సెంటర్ గుర్తింపును రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చు. అందుకు మూడేళ్ల జైలు జీవితంతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తారు. ఒక రేడియాలజీ వైద్యనిపుణుడు రెండుకు మించి సెంటర్లలో విధులు నిర్వహించడాన్ని చట్టం అనుమతించదు. విచారణలో లింగ నిర్ధారణ పరీక్షలకు రేడియాలజిస్ట్ లేక గైనకాలజిస్ట్ సిఫారసు చేసినట్లు రుజువైతే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు.