కాజీపేట, జూన్ 10 : రాష్ట్రంలో కేసీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు సైనికుల్లా పనిచేద్దామని మాజీ చీఫ్‌విప్, దాస్యం వినయ్‌భాస్కర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాజీపేట బాపూజీనగర్ పోచమ్మ దేవాలయ కమ్యూనిటీ హాల్లో బుధవారం 47, 62, 63 డివిజన్ల పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశానికి కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు, వారి తరపున పోరాడేందుకు కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని గడపగడపకు తెలపాలన్నారు. పార్టీపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. కేసీఆర్ పదేళ్ల, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనకు మధ్య వ్యత్యాసాన్ని వివరించాలన్నారు. పట్టణంలోని వైఎస్సాఆర్ నగర్లో పేదల గుడిసెలను కొందరు తొలగించాలని కుట్ర పన్నుతున్నారని, వారికి అండగా ఉండి పోరాడాలన్నారు.
పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కాగా, కాజీపేట పట్టణంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు యువకులు 47వ డివిజన్ అధ్యక్షుడు దువ్వ కనకరాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని దాస్యం పేర్కొన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు జోరిక రమేశ్, సంకు నర్సింగరావు, తండమల్ల రేవతీ వేణు, నాయకులు సాదినేని సుధాకర్, పోలపల్లి రాంమూర్తి, అశోక్, బెదరికోట రంజిత్ కుమార్, పాలడుగుల శివకుమార్, నార్లగిరి రమేశ్, సుంచు కృష్ణ, శిరుమల్ల దశరథం తదితరులు పాల్గొన్నారు.