ఖిలావరంగల్, ఫిబ్రవరి 6 : అదనపు కట్నం కోసం వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఏడు నెలల కుమారుడితోపాటు చెరువులో దూకి ఆత్మహత్మ చేసుకున్న కేసులో మృతురాలి కుటుంబ సభ్యులైన ఏడుగురిని మిల్స్‌కాలనీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. 2022, అక్టోబర్ 14వ తేదీన తస్లీమ్(23), మోమిన్పురానికి చెందిన ఎండీ తన్వీర్‌కు కరీంనగర్లో వివాహమైంది. రూ.1.50లక్షల నగదు, మూడు తులాల బంగారం, 26 తులాల వెండి కట్నంగా ఇచ్చారు.
షాదీముబారక్ చెక్ వచ్చాక బైక్ కోసం రూ.లక్ష ఇచ్చారు. అదనంగా రూ.26వేలు తీసుకురావాలని ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. దీంతో ఆమె జీవితంపై విరక్తి చెంది 1న సాయంత్రం 4గంటలకు ఇంట్లో నుంచి కుమారుడు థైమూర్(ఏడు నెలలు)ను తీసుకొని అన్నారం షరీఫ్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కాగా, మృతురాలి తల్లి ఫాతిమా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతురాలి భర్త తన్వీనర్, అత్త అఫ్జల్‌బీ, మామ మహమూద్, ఆడబిడ్డ తస్లీం, బావ ఫారూఖ్, తోటికోడలు షాజహ, ఆడబిడ్డ భర్త జాఫర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.