వరంగల్, జనవరి 1 : ఉమ్మడి జిల్లాకు వ్యాపార కేంద్రమైన వరంగల్ లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. పండ్ల మార్కెట్ స్థలంలో రూ.24 కోట్లతో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ పనులు చేపట్టారు. కూరగాయలు, మాంసం, చేపలు అన్నీ ఒకే చోట కొనుగోలు చేసేలా అధికారులు మార్కెట్ డిజైన్ చేశారు. మార్కెట్‌కు వచ్చే ప్రజల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ జోన్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రతి రోజు కూరగాయలు తీసుకొని వచ్చే ట్రక్లు సులువుగా లోడింగ్, అన్లోడింగ్ చేసుకొనేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 30 శాతం పనులు పూర్తికాగా.. మిగిలిన పనులు ఆరు నెలల్లో పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సరికొత్త హంగులతో సమీకృత మార్కెట్ నిర్మాణం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాకు వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు జెట్స్పీడ్తో జరుగుతున్నాయి. లక్ష్మీపురంలోని పండ్ల మార్కెట్ స్థలంలో రూ.24 కోట్లతో ప్రస్తుతం వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. మార్కెటింగ్ శాఖకు చెందిన స్థలం గ్రేటర్‌కు అప్పగించడంతో అక్కడ సమీకృత మార్కెట్ పనులు చేపట్టారు. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక శ్రద్ధతో పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ మార్కెట్‌కు ఆదనంగా మరో రూ.25 కోట్ల నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. కూరగాయలు, మాంసం, చేపలు అన్ని ఒకే చోట కొనుగోలు చేసేలా అధికారులు మార్కెట్‌ను డిజైన్ చేశారు.
వసతుల కల్పన..
వరంగల్ లక్ష్మీపురం పండ్ల మార్కెట్ స్థలంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రజలు పరిశుభ్ర వాతావరణంలో కూరగాయలు, మాంసం కొనుగోలు చేసేలా మార్కెట్ నిర్మాణం చేస్తున్నారు. అదనంగా మరిన్ని నిధుల కోసం స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృషి చేస్తున్నారు. మార్కెట్‌కు వచ్చే ప్రజల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ జోన్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. దీనికి తోడు సమీకృత మార్కెట్లో ప్రొవిజనల్ స్టోర్‌ను సైతం ఏర్పాటు చేయనున్నారు. ప్రతి రోజు కూరగాయలు తీసుకొని వచ్చే ట్రక్లు సులువుగా మార్కెట్లో లోడింగ్, అన్లోడింగ్ చేసుకొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, సమీకృత మార్కెట్లో కంపోస్ట్ యూనిట్లను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి జిల్లాలో కూరగాయల పండించే రైతుల ఇబ్బందులు తొలగనున్నాయి.
30 శాతం పనులు పూర్తి..
వరంగల్ లక్ష్మీపురంలో చేపట్టిన మార్కెట్ పనులు ఇప్పటికే 30 శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. కూరగాయలు, మాంసం వేర్వేరుగా విక్రయించేందుకు అధికారులు ప్రత్యేక జోన్ల నిర్మాణం చేపట్టారు. మరో ఆరు నెలల్లో సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు.