హనుమకొండ, జూలై 11 : మన పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. తద్వారా జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 అవార్డుల్లో సత్తా చాటేందుకు పోటీపడబోతున్నాయి. ఇందుకుగాను హనుమకొండ జిల్లాలో 15 గ్రామాలు ఎంపికవగా, ఈ నెల 15 నుంచి కేంద్ర బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి. పారిశుధ్య నిర్వహణ, వంద శాతం ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం, తదితర అంశాలను పరిశీలించనున్నాయి. అనంతరం ఎంపికైన గ్రామాలు అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 అవార్డులు అందుకోనున్నాయి.
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో పోటీని పెంచేందుకు కేంద్రం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ పురస్కారాల కింద ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ అవార్డులకుగాను జిల్లాలోని గ్రామ పంచాయతీలను మూడు కేటగిరీలుగా విభజించి, ఐదు అంశాల్లో పరిశీలించి ఎంపిక చేసిన 15 గ్రామాలను కేంద్రానికి పంపించారు. ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య కేంద్రం బృందాలు ఆయా గ్రామాలను సందర్శించనున్నాయి. క్షేత్ర స్థాయిలో కేంద్రం బృందం వంద శాతం ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం, తడి, పొడి చెత్త వేరు చేయడం, సేంద్రీయ ఎరువు తయారీ, కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం, ప్లాస్టిక్ నివారణ, స్వచ్ఛ సర్వేక్షణ్ వాల్ పెయింటింగ్స్, బయోగ్యాస్, స్వచ్ఛతలో ప్రజల భాగస్వామ్యం, పారిశుధ్యానికి తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలను పరిశీలించనుంది. అనంతరం ఎంపి కైన గ్రామాలకు అక్టోబర్ 2న స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 అవార్డులు అందించనున్నారు.
మూడు కేటగిరీలుగా జీపీల విభజన
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 అవార్డు కోసం జిల్లాలోని గ్రామ పంచాయతీలను జనాభా ప్రాతిపదికన మూడు విభాగాలుగా విభజించారు. ఐఎంఐఎస్ డాటా ఆధారంగా 0 నుంచి 2 వేల లోపు, 2 వేల నుంచి 5వేలు, 5వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలను మూడు కేటగిరీలుగా విభజించారు. ఇందులో నుంచి ఒక్కొక్క కేటగిరీ నుంచి ఐదు గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాలు పోటీలో ప్రగతి కనబర్చేందుకుగాను ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఈ గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, కిచెన్ గార్డెన్లు, తడి, పొడి చెత్త సేకరణ, ఇంకుడు గుంతలు, మరగుదొడ్ల వినియోగం, ప్లాస్టిక్ నివారణ, సేంద్రియ ఎరువు తయారీ లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర బృందం పర్యటించనున్న ఆయా గ్రామాల్లో సంబం ధిత శాఖల అధికారులు పర్యటించి దిశా నిర్దేశం చేస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ పురస్కార్ అవార్డు లక్ష్యంగా ఆయా గ్రామాలను సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో 15 గ్రామాల ఎంపిక
కేటగిరీ-1( 2వేల లోపు జనాభా)లో భీమదేవరపల్లి మండలం బోయినపల్లి గ్రామం, ధర్మ సాగర్‌లోని తాటికాయల, హసన్‌పర్తిలోని గంటూర్‌పల్లి, శాయంపేటలోని హుస్సేన్‌పల్లి, వేలేరు లోని షోడాషపల్లిని ఎంపిక చేశారు. కేటగిరీ-2(2వేల-5వేలు)లో ధర్మసాగర్‌లోని క్యాతంపల్లి, నడికూడలోని వరికోల్, పరకాలలోని వెల్లంపల్లి, వేలేర్లోని పీచర, ఎల్కతుర్తిలోని పెంచికలపేట, కేటగిరీ-3(5వేలకు పైగా జనాభా)లో ఆత్మకూరు, ఐనవోలులోని పంథిని, కమలాపుర్లోని ఉప్పల్, భీమదేవరపల్లిలోని ముల్కనూర్, దామెర మండలంలోని ఊరుగొండను ఎంపిక చేశారు.
గ్రామాలను ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపాం..
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 అవార్డు కోసం జిల్లాలో సర్వే ప్రక్రియ పూర్తయ్యింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో మూడు కేటగిరీల్లో ఒక్కొక్క కేటగిరి నుంచి ఐదు గ్రామాల చొప్పున మొత్తం 15 గ్రామాలను ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపించాం. ఈ నెల 15 నుంచి 25వ తేదీ మధ్యన కేంద్రం బృందాలు ఆయా గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తాయి. ఆ బృందాలు వివిధ అంశాల్లో పరిశీలించి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా గ్రామాలను ఎంపిక చేస్తారు. అనంతరం అక్టోబర్ 2వ తేదీన అవార్డులను అందజేస్తారు.
– ఏ శ్రీనివాస్‌కుమార్, డీఆర్డీవో, హనుమకొండ జిల్లా