స్టేషన్ ఘన్పూర్, జూన్ 19 : భూమిని నమ్ముకొని ఆరుగాలం కష్టపడుతూ దేశానికి అన్నం పెడుతున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తనం వేసిన దగ్గరి నుంచి పంట అమ్ముకునేంత వరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చివరకు అధిక దిగుబడి వస్తుందని ఆశచూపుతూ విత్తన కంపెనీలు సైతం అన్నదాతను మోసం చేస్తున్నాయి. వారి మాయమాటలు నమ్మి సాగు చేసిన రైతులు ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల, నారాయణపురం గ్రామాల్లోని పలువురు రైతులకు అధిక దిగుబడి వస్తుందని మక్కజొన్న, వరి విత్తనాలను ఆయా కంపెనీలు అంటగట్టాయి.
సముద్రాలకు చెందిన రైతు బుంగ ఎల్లస్వామికి జనగామకు చెందిన కంపెనీ ప్రతినిధి మహ్మద్ గౌస్ తమ కంపెనీ ఆడ, మగ వరి విత్తనాలు సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని, తరుగు లేకుండా క్వింటాకు రూ. 11 వేలతో కొనుగోలు చేస్తామని నమ్మబలికాడు. విత్తన సమస్యతో పంట దిగుబడి రానిపక్షంలో ఎకరానికి రూ. 80 వేలు చెల్లిస్తామని, ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలతో పంట దెబ్బతింటే ప్రభుత్వం మాదిరిగానే పరిహారం చెల్లిస్తామని బాండ్ పేపర్‌పై సైతం రాసిచ్చాడు. దీంతో నమ్మిన ఎల్లస్వామి తనకున్న ఎకరంతో పాటు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని ఆడ, మగ విత్తన వరి సాగుచేశాడు. ఇందులో ఎకరంన్నర ఎండిపోగా, మిగతా పొలంలో మగ విత్తనం దిగుబడి రాగా, ఆడ విత్తనం ఫెయిల్ అయ్యింది. ఈ విషయాన్ని మహ్మద్ గౌస్‌కు తెలపగా పంటను పరిశీలించి నష్టపరిహారం ఇస్తామని చెప్పడంతో పాటు ఏప్రిల్‌లో వరి పంటను కొనుగోలు చేసి తీసుకెళ్లాడు.
అప్పటి నుంచి పరిహారంతో పాటు కొనుగోలు చేసిన పంటకు డబ్బులు ఇవ్వకపోగా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నాడని రైతు ఎల్లస్వామి ఆరోపించాడు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ డబ్బులు ఇవ్వడం లేదని, తప్పనిసరి పరిస్థితిలో పంట పెట్టుబడి కోసం అప్పు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అలాగే ఇదేవిధంగా సముద్రాల, నారాయణపురంతో పాటు చిల్పూరు, జఫర్‌గఢ్ మండలాలకు చెందిన పలువురు రైతులకు ఆడ, మగ మక్కజొన్న విత్తనాలను అంటగట్టి పంట కొనుగోలు చేసిన అనంతరం డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు.
సముద్రాల, నారాయణపురం గ్రామాలకు చెందిని ఎనిమిది మందితోపాటు చిల్పూర్, జఫర్‌గఢ్ మండలాలకు చెందిన పలువురు రైతులకు ఇండో అమెరికన్ కంపెనీకి చెందిన సీడ్ ఆర్గనైజర్ మాయమాటలతో ఆడ, మగ మక్కజొన్న విత్తనాలు అంటగట్టాడు. ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, క్వింటాకు రూ. 3 వేల ధర చెల్లిస్తామని, పెట్టుబడి కింద ఎకరానికి రూ. 4 వేలతో పాటు పంట దెబ్బతింటే రూ. 60 వేలు పరిహారం ఇస్తామని బాండ్ పేపర్‌పై రాసిచ్చాడు. అయితే దిగుబడి 15 క్వింటాళ్లు కూడా రాకపోగా పండిన కొద్ది పంటను కూడా కంపెనీ వారు తీసుకుపోయి మూడు నెలలవుతున్నది. పంట నష్ట పరిహారం, మక్కజొన్న పైసలు ఇవ్వాలని అడిగితే తర్వాత ఇస్తామంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. వారం రోజుల కింద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. వానకాలం పెట్టుబడి కోసం అప్పు చేసే పరిస్థితి వచ్చింది.
– జలగం ప్రవీణ్, రైతు, సముద్రాల
అధిక దిగుబడి వస్తుందని, ధర అధికంగా చెల్లిస్తామని చెప్పే ప్రైవేట్ వ్యక్తుల మాయమాటలు నమ్మొద్దు. గుర్తింపు పొందిన, లైసెన్స్ ఉన్న కంపెనీలకు చెందిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మాత్రమే వినియోగించాలి. ప్రతి దానికి బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రైవేట్ వ్యక్తులు సూచించే విత్తనాల విషయాన్ని మా దృష్టికి తీసుకురావాలి.
– చంద్రన్ కుమార్, మండల వ్యవసాయాధికారి, స్టేషన్‌ఘన్‌పూర్