బచ్చన్నపేట ఆగస్టు 5 : జనవాసాలకు దూరంగా ఉండాల్సిన స్క్రాప్ దుకాణాలు(Scrap shops) జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోనే రహదారుల వెంట, జనవాసాల మధ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి. లక్షలు కురుపించే వ్యాపారం కావడంతో చాలా మంది దృష్టి ఈ వ్యాపారంపైకి మళ్లింది. ఫైర్ సేఫ్టీ, గ్రామపంచాయతీల అనుమతి లేకుండానే నిబంధనలు పట్టకుండా వ్యాపారం సాగుతోంది. వీటికి పన్ను కట్టక్కర్లేదు. జీఎస్టీ చెల్లింపులు పన్ను అక్కర్లేదని, పుట్టగొడుగుల్లా స్క్రాప్ దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. తొలుత జీవనోపాధికి పెట్టుకున్న ఈ షాపులు క్రమేపీ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరిస్తున్నాయి.
సాధారణంగా స్థానిక గ్రామ పంచాయతీ అనుమతితోనే స్క్రాప్ దుకాణాలు ఏర్పాటుచేయాలి. జిల్లా నుండి ఫైర్ స్టేషన్ అనుమతి ఉండాలి. మండలంలో ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ఇది జరగడం లేదు. స్ర్కాప్ కొనుగోలు, విక్రయాలు బిల్లు చెల్లింపుల ద్వారా జరగాలి. కానీ లారీలకు లారీలు లోడ్లతో స్క్రాప్ తరలుతున్నా ఎటువంటి పన్నులు చెల్లించడం లేదన్న ఆరోపణలున్నాయి. తప్పుడు వే బిల్లుతో తరలిస్తున్నట్టు సమాచారం. స్క్రాప్ దుకాణాల వల్లే ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. అందుకే ఊరికి దూరంగా నిర్వహించుకోవాలన్న స్పష్టమైన నిబంధన ఉంది. ఇది అమలవుతున్న దాఖలాలు లేవు.
భారీగా శ్రమదోపిడీ
స్క్రాప్ మాటున భారీగా శ్రమదోపిడీ జరుగుతోంది. సాధారణంగా స్క్రాప్ ఏరుకునే వారితో వ్యాపార ఒప్పందం చేసుకుంటారు. నిరుపేదలకు డబ్బులు ఆశచూపుతున్నారు. వారి నుంచి వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువకు విక్రయిస్తున్నారు. దొంగ చాటుగా రైతులకు చెందిన కాపర్, వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ తీగలు ప్లాస్టిక్ డ్రిప్స్ తో పాటు ప్రభుత్వరంగ సంస్థలు వినియోగించే వస్తువులు కొనడం, అమ్మడం నేరం. కానీ, ప్రతిస్ర్కాప్ దుకాణంలో అవే సామన్లు కనిపిస్తున్నాయి. చాలాచోట్ల బయటకు చిన్నపాటి దుకాణాల్లా ఉంటాయి. లోపల మాత్రం పెద్ద పెద్ద గొడౌన్లు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంటుంది.
లక్షలాది రూపాయల స్క్రాప్ ను స్టాక్ చేస్తున్నారు. ఇటువంటి షాపుల్లో ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. స్క్రాప్ దుకాణాలపై సమీప నివాసితులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకరమైన వస్తువులతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. వాటిపై నిఘా లేకపోవడంతో దొంగతనాలకు కూడా కారణమవుతున్నాయి.
నామమాత్రపు తనిఖీలు
ఇనుప సామగ్రి, విద్యుత్ శాఖకు సంబంధించి పాత స్తంభాలు కాసారాలు, కాలం చెల్లిన వాటిని దొంగిలించి ఇక్కడే గుట్టుగా విక్రయిస్తున్నారు. గతంలో చాలా కేసులకు సంబంధించి మూలాలు స్క్రాప్ దుకాణంలో బయటపడ్డాయి. కానీ అధికారులు నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. మండలంలోని స్క్రాప్ దుకాణాల నుండి నెలవారి మామూళ్లు వివిధ శాఖల అధికారులకు వెళుతుండటంతో వారి వ్యాపారానికి అడ్డు చెప్పే వారే లేకుండా పోయింది. ఇకనైనా అధికారులు స్పందించి జనవాసాల మధ్య స్క్రాప్ దుకణాలను తీసివేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.