తొర్రూరు, డిసెంబర్ 19 : విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని పాఠశాల క్రీడా సమాఖ్య జిల్లా కార్యదర్శి జ్యోతి తెలిపారు. పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో అండర్-4, 17, 19 విభాగాల రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి 600 క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఎస్జీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జ్యోతి, రాష్ట్ర పరిశీలకుడు అంతటి శంకరయ్య, జిల్లా క్రీడా కన్వీనర్ చెడుపల్లి ఐలయ్య తొలి రోజు బాక్సింగ్ పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాల క్రీడా సమాఖ్య జిల్లా కార్యదర్శి జ్యోతి మాట్లాడుతూ.. ధైర్యం ఉన్న వారే బాక్సింగ్‌లో రాణిస్తారని, ఈ ఆటకు నిరంతర సాధన అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక పరిశీలకుడు పార్థసారథి, వ్యాయామ ఉపాధ్యాయులు సునీల్, విజయ్‌చందర్, సత్యనారాయణ, కోచ్‌లు పాల్గొన్నారు.