వేలేరు : గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం జిల్లా సభలను విజయవంతం చేయాలని జీఎంపీఎస్ వేలేరు మండల అధ్యక్షుడు మండల సంపత్ కుమార్ కోరారు. సోమవారం జిల్లా మహాసభల వాల్ పోస్టర్ ను వేలేరు మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జులై 4వ తేదీన కాజీపేట రైల్వే స్టేషన్ నుండి ఉదయం 10 గంటలకు ర్యాలీ జరుగుతుందని గొల్ల కురుమలు డోలు, గజ్జలతో అధిక సంఖ్యలో హాజరై మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గొర్రెలు, మేకల పెంపకం దారులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించి చదువుకున్న యువతీ యువకులు ఉపాధి కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక సంఘం గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘమని అన్నారు. గొర్రెలు మేకల పెంపకం దార్ల సంఘం కార్యదర్శి మండల బంక శ్రీనివాస్ మాట్లాడుతూ రెండో విడత గొర్రెల పంపిణీ నగదు బదిలీ ద్వారా అమలు చేస్తామని కామారెడ్డి లో జరిగిన బిసి డిక్లరేషన్ సభలో చెప్పారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2 లక్షల నగదు బదిలీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలలో చేస్తామని హామీ ఇచ్చింది . హామీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యాదవ సంఘం చైర్మన్ సూత్రపు కొంరయ్య, ఐలయ్య, కుమార్, సాంబరాజు, వెంకన్న, ఆగయ్య, సదయ్య, మల్లేశ్, రాజయ్య, కొంరయ్య, శ్రావణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.