గంగారం, ఫిబ్రవరి 20 : మేడారం మహాజాతర ఘడియలు సమీపించాయి. అపురూప ఘట్టానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. వనంబాట పట్టిన భక్తులు తల్లుల రాక కోసం తనువెల్లా కన్నులై ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం జాతరలో కొలువుదీరేందుకు గిరిజన సంప్రదాయాల నడుమ మంగళవారం బయల్దేరారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండల పరిధిలోని పూనుగొండ్ల నుంచి వడ్డెలు పగిడిద్దరాజు పడిగెతో అటవీ మార్గాన మేడారం బాటపట్టారు. రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు పూనుగొండ్ల పెనక వంశస్తులు పగిడిద్దరాజును వరుడిగా అలంకరించి మేడారం తరలించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈక్రమంలో మంగళవారం పెనక వెంకటేశ్వర్లు ఇంట్లో పసుపు, కుంకుమతో పూజలు చేసి అక్కడి నుంచి డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల నడుమ నేరుగా పగిడిద్దరాజు ఆలయానికి వెళ్లారు. పసుపు, కుంకుమ భరిణెలపై ఎరుపు రంగు వస్ర్తాన్ని కప్పి ఆలయంలో ఉంచి మొక్కులు సమర్పించారు. అనంతరం పూజారులు వెదురు కర్రలను తీసుకొచ్చి పగిడిద్దరాజు ప్రతిమను తయారు చేసి గద్దెపై ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు.
శివసత్తుల పూనకాలు, డప్పుచప్పుళ్లతో పగిడిద్దరాజు ఆలయం వద్ద పండుగ వాతావరణం నెలకొన్నది. తర్వాత వడ్డె జగ్గారావు పడిగెను పట్టుకొని బయల్దేగా, ఆయన వెంట పూజారులు, భక్తులు తరలివెళ్లారు. ఊరు దాటే వరకు మహిళలు నీళ్లారబోస్తూ ‘వరుడిగా వెళ్లి.. మరువెళ్ల్లికి రావయ్యా.. బాటసారులకు ఎలాంటి ఆపద రాకుండా తీసుకెళ్లవయ్యా..’ అంటూ సాగనంపారు. సుమారు 70 కిలోమీటర్లు అటవీ మార్గంలో కాలినడన పయనించి మేడారం చేరుకోనున్నారు. మారమధ్యంలో కర్లపల్లి, లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య ఇంటి వద్ద గద్దెపై పగిడిద్దరాజు ప్రతిమను ప్రతిష్ఠించి, వారి ఆతిథ్యం స్వీకరిస్తారు. తిరిగి బుధవారం ఉదయం 4 గంటలకు బయల్దేరి సాయంత్రం ఆరు వరకు మేడారం చేరుకుంటామని పూజారులు పెనక సురేందర్, రాజేశ్వర్, పురుషోత్తం తెలిపారు.