వరంగల్, ఆగస్టు 20 : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెంచర్ యునిసిటీలో ప్లాట్ల కొనుగోలుకు ప్రజలు పోటీ పడ్డారు. తొలి విడుతలో ప్లాట్లు ఫుల్ సేల్ అయ్యాయి. ఉనికిచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో యునిసిటీలో అదివారం ఉదయం 11 నుంచి 5 గంటల వరకు కుడా అధికారులు వేలం నిర్వహించారు. కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, వైస్ చెర్మన్ షేక్ రిజ్వాన్ బాషా పర్యవేక్షణలో ప్లాట్ల వేలం జరిగింది. అత్యధిక ధర గజానికి రూ.23,300, కనిష్ఠంగా గజానికి రూ. 17,800 పలికింది. కుడా నిర్వహించిన ఓ సిటీ, మా సిటీ వెంచర్లు సక్సెస్ కావడంతో మూడో వెంచర్ యునిసిటీకి డిమాండ్ పెరిగింది. ప్లాట్ల కోనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
యునిసిటీలో తొలి విడుతలో కుడా అధికారులు 56 ప్లాట్లకు వేలం నిర్వహించగా అన్ని హాట్‌కేక్‌లా అమ్ముడుపోయాయి. సుమారు 250 మంది రూ. 25వేలు చెల్లించి టోకెన్లు తీసుకోని వేలంలో పాల్గొన్నారు. 200, 300 గజాల చొప్పున 56 రెసిడెన్సియల్ ప్లాట్లకు వేలం నిర్వహించారు. తూర్పు ప్లాటు రూ.13 వేలు, పశ్చిమం వైపు ఉన్న ప్లాట్‌కు రూ.12 వేలు కనీస ధరగా నిర్ణయించారు. తొలి విడుత ప్లాట్ల వేలంలో గజానికి రూ. 23,300 అత్యధిక ధర పలికింది. కనిష్ఠ ధర 17,800 పలికింది. కాగా, రుణాలు ఇచ్చేందుకు ప్లాట్ల వేలం ప్రాంగణంలో వివిధ బ్యాంకులు కౌంటర్లు ఏర్పాటు చేశాయి.
యూనిసిటీ ప్లాట్ల విక్రయం పారదర్శకంగా నిర్వహించామని కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ అన్నారు. కొనుగోలు దారులు ఎలాంటి అపోహ పడాల్సిన అవసరం లేదన్నారు. యునిసిటీలో భవిష్యత్‌లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కుడా వైస్ చైర్మన్ షేక్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. కుడా ఆధ్వర్యంలో చేసిన ఓ సిటీ, మా సిటీ తరహాలోనే యునిసిటీలో దశల వారీగా వసతులు కల్పిస్తామన్నారు. త్వరలోనే డ్రైనేజీ, లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కుడా కార్యదర్శి మురళీధర్‌రావు, ఈఈ భీమ్రావు, సిబ్బంది పాల్గొన్నారు.