హనుమకొండ, జూలై 10 : రాష్ట్రంలో మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలకు వేతనాలు అందడం లేదు. ఆరు నెలల నుంచి వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీల వేతనాలకు నిధులు మంజూ రు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 3తో మండల పరిషత్‌లు, 4వ తేదీతో జిల్లా పరిషత్ పాలక మండళ్ల పదవీ కాలం పూర్తయింది.
బీఆర్ఎస్ పాలనలో రెగ్యులర్‌గా వేతనాలు రాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అందకపోవడంపై మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖకు నిధుల కొరత ఉండడంతో గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల చెక్కులు పాస్ కావడం లేదని కొందరు మాజీ జడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
15వ ఆర్థిక సంఘం నిధులు అరకొరగా వస్తున్నప్పటికీ స్టేట్ ఫైనాన్స్ నుంచి ఒక్క రూపాయీ విడుదల చేయలేదని అంటున్నారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే లోక్‌సభ ఎన్నికల కోడ్ సాకుతో నిధులు మంజూరు చేయలేదు. అయితే కోడ్ ముగిసినా నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభు త్వం వెంటనే స్థానిక సంస్థలకు పెండింగ్ నిధులు మంజూరు చేసి మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీల గౌరవ వేతనాలు వెంటనే అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆరు నెలలుగా ఎదురు చూపులు..
జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు గౌరవ వేతనం కోసం ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నారు. జడ్పీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లా (హనుమకొండ) పరిధిలో 86 మంది ఎంపీటీసీలకు ప్రస్తుతం 83 మంది ఉన్నారు. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే జిల్లా పరిషత్‌లో ఏడుగురు జడ్పీటీసీలుండగా, ఇందులో ఒకరు చైర్మన్, మరొకరు వైస్ చైర్మన్ కాగా, మరో ఐదుగురు సభ్యులతో పాటు ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు ఉండేవారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, కో ఆప్షన్ మెంబర్స్‌కు గౌరవ వేతనంగా నెలకు రూ. 10వేలు, ఎంపీటీసీలకు రూ. 5వేలు ఇస్తున్నారు. వీరందరికీ ఆరు నెలల నుంచి వేతనం పెండింగ్‌లో ఉంది.
వెంటనే అందించాలి..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచి గౌరవ వేతనాలు ఇవ్వడం లేదు. ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. 15వ ఆర్థిక సంఘం నిధులు కొంత వస్తున్నప్పటికీ ఎస్ఎఫ్సీ నిధులు మాత్రం రావడం లేదు. అంతేకాక గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి కూడా చెక్కులు బౌన్స్ అయిన సందర్భాలు ఉన్నాయి. మా పదవీకాల పరిమితి గడువు ఇప్పటికే పూర్తయింది. వెంటనే గౌరవ వేతనాలు ఇప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– చాడ సరిత, మాజీ జడ్పీటీసీ, వేలేరు