ఖిలావరంగల్: చారిత్రక కాకతీయ రాజధాని ఓరుగల్లు కోట మరో అపురూప ఘట్టానికి వేదిక కానుంది. యాదవ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ సయ్యాట వేడుకలు ఈ నెల 23వ తేదీన ఖిలావరంగల్ ఖుష్‌మహల్ మైదానంలో సదర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు మధ్యకోటలో సదర్ సయ్యాట వేడుకలకు సంబంధించిన కరపత్రాలను ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు బైరబోయిన దామోదర్‌యాదవ్, అధ్యక్షుడు దేబోయిన రవియాదవ్, ప్రధాన కార్యదర్శి బైరబోయిన కైలాస్‌యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం వేడుకలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దున్న రాజులతో గ్రాండ్ ఊరేగింపు
గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి కోట పురవీధుల్లో ప్రత్యేకంగా అలంకరించిన దున్న రాజులు ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం హైదరాబాద్, హర్యానా, బీహార్ వంటి ప్రాంతాల నుంచి పటిష్టమైన, అందంగా అలంకరించబడిన దున్న రాజులు ఓరుగల్లు కోటకు తరలివస్తున్నాయి. దున్నపోతులకు ప్రత్యేక పూజలు చేసి, వాటిని రంగు రంగుల పూలదండలు, అలంకరణ సామాగ్రితో ముస్తాబు చేస్తారు.
సాంస్కృతిక శోభ
ఊరేగింపు అనంతరం ఖుష్‌మహల్ మైదానంలో ప్రధాన వేడుకలు జరగనున్నాయి. ఇక్కడ దున్న రాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకోనున్నాయి. ముఖ్యంగా యాదవ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా హైదరాబాద్ కళాకారులచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. గత ఏడాది యువకుల చొరవతో ప్రారంభమైన ఈ సదర్ సయ్యాట వేడుకలు, ఈ ఏడాది యాదవ కుల సంఘాల ఆధ్వర్యంలో మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆహ్వానం
పార్టీలకు, కుల మతాలకు అతీతంగా నిర్వహించబడుతున్న ఈ సదర్ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ ఓరుగల్లు ప్రజలను, యాదవేతర సోదరులను, పర్యాటకులను కోరుతోంది. కాకతీయుల వైభవానికి, యాదవుల సాంస్కృతిక ప్రతీక అయిన సదర్ వేడుకలకు ఈనెల 23న ఖిలావరంగల్ కోట మైదానం సజీవ సాక్ష్యంగా నిలవనుంది. కాగా ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా పర్యావరణ, అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ హాజరవుతున్నారని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
యాదవుల పరస్పర సహకారంతో సదర్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షుడు మేకల రాజుయాదవ్, చంద్రమౌళి, సహయ కార్యదర్శులు బైరబోయిన రవీందర్ యాదవ్, నాగరాజు, పెద్ద రవిందర్, మేకల మల్లయ్య, అల్లి చందర్, తరుణ్‌యాదవ్, సన్నబోయిన చంద్రశేఖర్, ప్రకాష్, గణేష్, కార్తీక్, భరత్, జితేందర్, సాయినాథ్, గుణశేఖర్, అరుణ్, విజయ్‌కుమార్, అఖిల్, మణిదీప్, రాకేష్, రాజేష్, సూరి తదితరులు పాల్గొన్నారు.