అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని కించపరిచేలా మాట్లాడిన సీఎంకు వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం నిరసనలు మిన్నంటాయి. బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశాయి. పలుచోట్ల దహనాన్ని పోలీసులు అడ్డుకోగా కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
– నమస్తే నెట్వర్క్, ఆగస్టు 1
మహబూబాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి సీఎం రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
నిండు శాసనసభలో సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదని, ఆడబిడ్డలంటే అంత అలుసెందుకన్నారు. అసెంబ్లీలో ఆడబిడ్డల ఆత్మగౌరవంపై ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయించడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెప్తారని కవిత పేర్కొన్నారు.