హనుమకొండ రస్తా : వరంగల్ యూనిట్ నమస్తే తెలంగాణ ( Namaste Telangana ) దినపత్రిక కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నాగరాజు (Vemula Nagaraju ) అన్నారు. వరంగల్ మీడియా చరిత్రలో ఏనాడు కూడా పత్రికల కార్యాలయాలపై దాడి జరగలేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచిన పత్రికపై దాడి చేయటం సిగ్గు మాలిన చర్య అని పేర్కొన్నారు.
దాడికి పాల్పడ్డ వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్రికా కార్యాలయం యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టు లోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు. లేని పక్షంలో యూనియన్ల ఆధ్వర్యంలో ఉమ్మడి కార్యాచరణకు దిగుతామని వెల్లడించారు.
స్వేఛ్చగా వార్తలు రాసే హక్కు పత్రికలకు ఉంటుందని తెలిపారు. గుండాగిరి చేసి బెదిరింపులకు పాల్పడటం మంచి సాంప్రదాయం కాదని, పత్రికా కార్యాలయంపై దాడికి దిగిన వారిని అరెస్టు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, దాడికి ఉసిగొల్పిన వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని కోరారు.