ఖానాపురం, డిసెంబర్ 5 : వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ శివారులో కాకతీయుల చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే మట్టి కోట మాయం కాగా శివాలయం శిథిలావస్థకు చేరింది. పాలకులు, అధికారుల పట్టింపులేమితో భవిష్యత్తరాలకు వారసత్వంగా అందించాల్సిన కట్టడాలు కాలగర్భంలో కలిసిపోనున్నాయి. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు 1213లో దట్టమైన అడవుల మధ్యన పాకాల సరస్సును నిర్మించారు. కాకతీయ రాజులు అడవి జంతువుల వేటను అమితంగా ఇష్టపడేవారు.
దీంతో వారు తరచూ పాకాల అడవులకు వచ్చేవారు. ఈ క్రమంలో ఇక్కడ విడిది చేసేందుకు ప్రస్తుతం సైనిక్ స్కూల్ ఉన్న ప్రదేశంలో కోటను నిర్మించుకున్నారు. దీని చుట్టూ నాలుగు మూలల్లో కాపలాదారులు ఉండేలా ఎత్తైన గోడ నిర్మించారు. దీనిపైనే సైనికులు గుర్రాలపై తిరుగుతూ రాజులకు రక్షణ కల్పించేవారు. ప్రస్తుతం ఈ కోట గోడ శిథిలావస్థకు చేరింది. అలాగే అదే ప్రాంతంలో అశ్వశాలను నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
అలాగే అదే ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో శత్రుదుర్బేధ్యంగా మట్టి కోటను సైతం నిర్మించారు. యుద్ధాలు వచ్చినప్పుడు కాకతీయ రాజులు ఎక్కువగా ఇక్కడే ఉండి వ్యూహాలు పన్నేవారట. వేటకు వెళ్లే ముందు తమ ఇష్టదైవమైన శివుడిని పూజించేవారు. అందుకోసమే మట్టి కోట మధ్య భాగంలో రాతి శిలలతో శివాలయాన్ని కట్టించారు. వారి కాలంలో శివాలయం దేదీప్యమానంగా వెలుగొందగా ఆలయం నుంచి వరంగల్ కోట వరకు సొరంగ మార్గం ఉండేదని ప్రచారంలో ఉంది. యుద్ధాలు, అత్యవసర సమయాల్లో కాకతీయ రాజులు ఈ మార్గాన్ని ఉపయోగించుకునేవారట.
కాకతీయ రాజులు నిర్మించిన మట్టి కోట, శివాలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకున్నాయి. మట్టి కోట బీటలు వారి భూమిలో కలిసిపోతుండగా, శివాలయం పూర్తిగా ధ్వంసమైంది. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపడంతో ఆలయం దెబ్బతిని శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం పిచ్చిమొక్కలు పెరిగి శివాలయం ఆనవాళ్లు కోల్పోయింది. ఇంతటి చారిత్రక నేపథ్యమున్న శివాలయాన్ని పురావస్తు శాఖ అధికారులు పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.