నెక్కొండ, సెప్టెంబర్ 1: మండలంలో వెంకటాపురం-తోపనపల్లి మధ్య రెండు లోలెవల్ కాజ్‌వేల నడుమ ఆర్టీసీ బస్సు చిక్కుకోవడంతో ప్రయాణీకులు రాత్రంతా అక్కడే ఉన్నారు. సోమవారం ఉదయం అధికారులు సురక్షితంగా తరలించారు. వరంగల్ నుంచి మహబూబాబాద్‌కు రాత్రి ఏడు గంటలకు బయల్దేరిన ఆర్టీసీ బస్సు మండలంలోని వెంకటాపురం-తోపనపల్లి మధ్య వరద నీటితో ప్రవహిస్తున్న లోలెవల్ కాజ్‌ను దాటింది. మరో లోలెవల్ కాజ్‌వేను దాటే ప్రయత్నంలో వరదనీటి ఉధృతి పెరిగింది. దీంతో డ్రైవర్ బస్సును వెనక్కితీసి రోడ్డుపై నిలిపాడు.
రెండు కల్వర్టుల నడుమ 200 మీటర్ల దూరం ఉంటుంది. బస్సులో 45 మంది ఉన్నారు. వారు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. సమాచారాన్ని అధికార యంత్రాంగానికి పోలీసులు చేరవేశారు. తహసీల్దార్ రాజ్‌కుమార్, సీఐ చంద్రమోహన్, ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చేరుకున్నారు. రైల్వేవిభాగానికి చెందిన సిమెంట్ పట్టాల లోడుతో కూడిన లారీలను తెప్పించారు. బస్సులోని ప్రయాణికులను లారీల్లో కూర్చోబెట్టి లోలెవల్ కాజ్వే పైకి వెనక్కి తీసుకువచ్చారు. అక్కడి నుంచి వెంకటాపురం ప్రాథమిక పాఠశాలకు తరలించారు.
ప్రయాణికులకు గ్రామస్తుల సహకారంతో తాగునీరు, టీ అందించారు. పాఠశాలలో తాత్కాలిక శిబిరాన్ని కలెక్టర్ సత్యశారదాదేవి సందర్శించి ప్రయాణీకులను పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పోలీసు బలగాలతో వచ్చారు. నెక్కొండ సమీపంలో రోడ్డుపై వరద నీటి ఉధృతితో వెంకటాపురం వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోగా పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వారిని నెక్కొండకు తరలించాలని సూచించారు. నెక్కొండ పోలీస్ స్టేషన్లో జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, పోలీస్ కమీషన్ అంబర్ కిశోర్ ఝా, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తాజా పరిస్థితిని సమీక్షించారు. నెక్కొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వారికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భోజనం సమకూర్చారు. వరంగల్ నుంచి మరో ఆర్టీసీ బస్సును నెక్కొండకు తెప్పించి జిల్లా కేంద్రానికి తరలించారు.