గోవిందరావుపేట, జనవరి 17 : అదుపుతప్పి ఆర్టీసీ బస్సు పత్తిచేనులోకి దూసుకెళ్లిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం హనుమకొండ నుంచి ఏటూరునాగారానికి ప్రయాణికులతో బయల్దేరిన టీఎస్ 27 జడ్ 0011 నంబర్‌గల ఆర్టీసీ బస్సు మచ్చాపూర్ శివారులోకి రాగానే ఒక్కసారిగా స్టీరింగ్ లాక్ అయి పత్తి చేనులోకి దూసుకెళ్లింది.
ఈ క్రమంలో డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు పల్టీకొట్టి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని పస్రా ఎస్సై కమలాకర్, ఆర్టీసీ అధికారులు పరిశీలించారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం 108 వాహనంలో ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.