జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్20 (నమస్తే తెలంగాణ) ; కొందరు అక్రమార్కులు ఏకంగా చెరువు శిఖాన్నే స్వాహా చేశారు. పక్కనే ఉన్న సర్వే నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయించి, పట్టా భూమిగా మార్చి, ప్లాట్లు చేసి ఎంచక్కా అమ్మకానికి పెట్టారు. గుంట కాదు.. రెండు గుంటలు కాదు.. సుమారు రూ.6 కోట్ల విలువైన 3.32 ఎకరాల చెరువు శిఖాన్ని అప్పనంగా కాజేసి, రెండింతల ఆదాయం పొందారు. ఈ తతంగంలో ఓ రెవెన్యూ అధికారి కీలక పాత్ర పోషించగా, అతడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం భూపాలపల్లి మండలం కొంపెల్లి శివారు 209 సర్వే నంబర్లోని గోరంట్లకుంట చెరువు శిఖానికి రెవెన్యూ అధికారులు నాలా అనుమతి ఇచ్చినట్లు సమాచారం. చెరువు శిఖం మొత్తం 22.32 ఎకరాలు ఉండగా, ఇందులో నాలుగు ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇదే సర్వే నంబర్లో వేంకటేశ్వర దేవాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఆర్ అండ్ బీ అతిథి గృహాన్ని సుమారు 5 ఎకరాల్లో నిర్మించారు. మరో 3.32 ఎకరాల శిఖం భూమి ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లింది. 209 సర్వే నంబర్లో చెరువు శిఖం భూమి ఉండగా పక్కనే 213, 208 సర్వే నంబర్లలో పట్టా భూములు ఉన్నా యి. ఇది అక్రమార్కులకు కలిసొచ్చింది. 208, 213 సర్వే నంబర్ల పేరుతో చెరువు శిఖం భూమికి రెవెన్యూ అధికారుల నుంచి నాలా అనుమతి పొంది, ఏకంగా రిజిస్ట్రేషన్ చేయించారు. కొన్నేళ్లుగా ఈ తతంగం జరుగుతున్నా, ఇటీవల కాలంలోనే రియల్ వ్యాపారులు ఒక రెవెన్యూ అధికారి కనుసన్నల్లో నాలా అనుమతి పొంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిసింది.
శిఖంలో రియల్ దందా
జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న 209 సర్వే నంబర్లోని గోరంట్లకుంట చెరువు శిఖం భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిజినెస్ ప్రారంభించారు. చెరువు శిఖంలో అక్రమార్కులు 1.32 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్, 1.25 ఎకరాల్లో వ్యవసాయం, 15 గుంటల్లో ప్లాట్లు ఏర్పాటు చేసుకున్నారు. 213, 208 సర్వే నంబర్లలోని పట్టా భూముల నంబర్లను వేసి శిఖం భూమికి నాలా అనుమతి పొంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఓ రెవెన్యూ అధికారి నాలా అనుమతి ఇవ్వడంలో ప్రధాన భూమిక పోషించినట్లు తెలుస్తున్నది. ఇందులో 1.25 ఎకరాల్లో ఒకరు వ్యవసాయం చేసుకుంటుండగా , 15 గుంటల భూమిని కొందరు ప్లాట్లు చేసుకున్నారు. మరో 1.32 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు చేసి విక్రయించారు. కాగా, కొనుగోలు చేసిన వారు విషయం తెలుసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా ఓ రెవెన్యూ అధికారి శిఖం హద్దులు కావాలనే తప్పుగా ఏర్పాటు చేయడంతో సుమారు 2 ఎకరాల భూమిని కొందరికి లబ్ధి చేకూర్చాడనే ప్రచారం జరుగుతున్నది. కాగా, శిఖం భూమి చుట్టూ ఆక్రమిత ప్రాంతంలో సైతం నీటిపారుదల అధికారులు హద్దురాళ్లు ఏర్పాటు చేయగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తొలగించారు. గోరంట్లకుంట చెరువు శిఖంలో పూర్తిస్థాయిలో సర్వే చేసి మళ్లీ హద్దులు వేస్తే పెద్దఎత్తున అవినీతి బట్టబయలు అవుతుందని పలువురు స్థానికులు పేర్కొంటున్నారు.
కేసు ఫైల్ చేశాం : బసవ ప్రసాద్, ఐబీ డీఈ
భూపాలపల్లిలోని 209 సర్వేనంబర్‌లో గోరంట్లకుంటలో 22.32 ఎకరాల చెరువు శిఖం ఉండగా ఇందులో సుమారు 5 ఎకరాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఆర్అండ్బీ అతిథి గృహం, వేంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణం జరిగింది. 1.25 ఎకరాల భూమిని ఒకరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని వ్యవసాయం చేస్తున్నాడు. అలాగే 15 గుంటల భూమిని కొందరు ప్లాట్లుగా మార్చారు. 1.32 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేశారు. అధికారుల సహకారంతో నాలా అనుమతి పొంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. విచారణ జరిపి కేసు ఫైల్ చేశాం. నివేదిక కలెక్టర్‌కు సమర్పించాం. కలెక్టర్ స్టడీ చేస్తున్నారు. త్వరలోనే చర్యలు ఉంటాయి.