కమలాపూర్, మార్చి 12: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా ఉన్నది జిల్లా అధికారుల పనితీరు. సివిల్ సప్లయ్ నుంచి నిధులు మంజూరైనా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అందాల్సిన కమీషన్ డబ్బులు రూ. కోట్లలో పెండింగ్లో ఉన్నాయి. బ్యాంకు ల్లో పెట్టి తప్పుడు బిల్లులు పెడుతూ మిత్తిని కాజేస్తున్నారని ఆరోపణలున్నాయి. నేటికీ కమీషన్ అందకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు 2024-25 సంవత్సరంలో వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి రూ.7 కోట్లకు పైగా కమీషన్ చెల్లించాల్సి ఉన్నది.
2024-25 వానకాలంలో 44 ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 25.149 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, రూ. 78.3లక్షలు, 102 పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో 71.470 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, రూ. 2.28 కోట్ల కమీషన్ డబ్బులు ఇవ్వాల్సి ఉన్నది. యాసం గి సీజన్లో 70 ఐకేపీ కేంద్రాల్లో 48,54 6,880 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, రూ.1.40 కోట్లు, 82 పీఏసీఎస్ కేం ద్రాల్లో 79,778వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే రూ.2.50 కోట్లు, మొత్తం సుమారుగా రూ.7 కోట్లకుపైగా కమీషన్ డబ్బులు సివిల్ సప్లయ్ అధికారులు డీఆర్డీఏ(జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి), డీసీవో(జిల్లా కోఆపరేటివ్ అధికారి)లకు చెల్లించారు. అయినప్పటికీ జిల్లాస్థాయి అధికారులు వాటిని తమ ఖాతాల్లోనే ఉంచుకొని వచ్చే ఇంట్రెస్ట్ డబ్బులను తప్పుడు బిల్లులు పెట్టి స్వప్రయోజనాలకోసం వాడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో జిల్లా అధికారులను అడిగే సాహ సం కిందిస్థాయి అధికారులు చేయకపోవడంతో కమీషన్ డబ్బుల చెల్లింపులో జాప్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2023-24లో ఖరీఫ్, రబీ సీజన్లకు పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు కేంద్రా ల నిర్వాహకులకు కేవలం 70శాతం కమీషన్ మాత్రమే చెల్లించి, 30శాతం చెల్లించలేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. మిగతా డబ్బులు ఎందుకు చెల్లించలేదని అడిగే వారే లేకపోవడంతో జిల్లా అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జిల్లా అధికారులు నిర్వాహకులకు మొండిచేయి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
కమలాపూర్ పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సుమారు రూ. కోటికిపైగా కమీషన్ బకాయి ఉన్నట్లు తెలిసింది. దీంతో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని పేర్కొంటున్నారు. 2025 డిసెంబర్లో పీఏసీఎస్ పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రత్యేకాధికారులను నియమించారు. ఈ క్రమంలో జిల్లాస్థాయి అధికారులను కమీషన్ డబ్బులు అడిగే నాథుడే కరువైయ్యాడని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.