పోచమ్మమైదాన్, ఆగస్టు 9: ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి జరుగుతున్నాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. రూ. 2.88 కోట్లతో 12వ డివిజన్ దేశాయిపేటలోని లక్ష్మీమెగా టౌన్షిప్, ముదిరాజ్ కాలనీ, సెకండ్ డాక్టర్స్ కాలనీ, గాంధీనగర్, బాలాజీ నగర్, స్నేహనగర్, కేఎల్ మహేంద్రనగర్, మైనార్టీ కాలనీల్లో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.3,800 కోట్లతో తూర్పు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులతో వరంగల్ రూపురేఖలు మారిపోతున్నాయని తెలిపారు.
అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. కార్పొరేటర్ కావటి కవితా రాజు యాదవ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సోల రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్లోని మహిళలు ఎమ్మెల్యేకు బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. అలాగే, 13వ డివిజన్ ఎల్బీనగర్లోని తాజ్ ఫంక్షన్ హాల్ వద్ద రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీరోడ్లు, డ్రైనేజీలు, వివిధ అభివృద్ధి పనులను నన్నపునేని ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్‌కుమార్ జోషి, నాయకులు యాకుబ్ పాషా, సరళ, రాజేందర్ సింగ్, మధుకర్, బియాబాని, శ్రీధర్, సురేశ్, రాజేందర్, రాజేశ్వర్‌రావు, డాక్టర్ స్వామి, పద్మ, జ్యోతి, రాధ, ఉదయ్ పాల్గొన్నారు.
కాశీబుగ్గ/గిర్మాజీపేట: వరంగల్ 18వ డివిజన్ లేబర్‌కాలనీలో రూ. 21.56 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నరేందర్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశంలో తూర్పు నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే అన్నారు. సమష్టి కృషితో తూర్పు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు, మాజీ కార్పొరేటర్ రాజేందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గిర్మాజీపేట: సినీహీరో మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా వరంగల్‌లోని వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు అందజేయడానికి ముందుకొచ్చిన మహేశ్‌బాబు యువసేన సభ్యులు అభినందనీయులని సీపీ రంగనాథ్ ప్రశంసించారు. యువసేన అధ్యక్షుడు గందె నవీన్, కార్పొరేటర్ గందె కల్పన ఆధ్వర్యంలో నిర్వహించిన మహేశ్‌బాబు జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్యే నరేందర్, సీపీ రంగనాథ్ హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం హంటర్‌రోడ్‌లోని ఎన్టీఆర్నగర్కాలనీ వాసులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఏసీపీ బీ కిషన్, సీఐలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.