కాశీబుగ్గ, ఫిబ్రవరి13 : ఆసియాలోనే రెండో పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల మార్కెట్ పాలకవర్గం వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.13కోట్లు కావాలని విన్నవించగా, సర్కారు తొలి విడుతగా రూ. 8కోట్ల 50 లక్షలు విడుదల చేసింది. ఈ నిధులతో పాలకవర్గం పత్తి, మిర్చి, పల్లి, పసుపు యార్డుల్లో మరిన్ని ప్లాట్‌ఫామ్‌లు, రేకుల షెడ్లు, మార్కెట్ పరిధిలో టాయ్లెట్లు, మరో రెండు స్వాగత తోరణాలు నిర్మించడంతో పాటు వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నది. మిగతా రూ. రూ.4.5కోట్లు కూడా త్వరలోనే వస్తాయని మార్కెట్ అధికారులు తెలిపారు. మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తుండడంతో రైతులు సంబురపడుతున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండో మార్కెట్‌గా ఉండడంతో అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. రైతు శ్రేయస్సే ధ్యేయంగా ముందుకెళ్తున్న తెలంగాణ సర్కారు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు మార్కెట్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావొద్దనే ధ్యేయంతో ప్రతి సంవత్సరం మార్కెట్‌కు నిధులు కేటాయిస్తున్నది. మారుతున్న కాలాన్ని బట్టి ఆధునిక వసతులు సమకూరుస్తున్నది. సమైక్య పాలనలో వ్యవసాయరంగం నిర్లక్ష్యానికి గురైంది. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా సర్కారు చర్యలు తీసుకుంది. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు పంట పెట్టుబడికి రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లబించేలా కృషి చేస్తున్నది. తక్కువ ధరకు పంటలు అమ్ముకోవద్దని సూచిస్తూ మార్కెట్లో రైతుబంధు పథకం ద్వారా వడ్డీలేని రుణాలు ఇస్తున్నది.
మార్కెట్ అభివృద్ధికి రూ.13 కోట్లు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ అబివృద్ధి కోసం మార్కెట్ కమిటీ పాలకవర్గం రూ.13 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, వీటిలో రూ.8 కోట్ల 50 లక్షలు మంజూరయ్యాయి. మార్కెట్‌కు అనుసంధానంగా ఉన్న వేలేరు మండలం సోడషషపల్లిలో సబ్‌యార్డు నిర్మాణం కోసం రూ.కోటి 98 లక్షలు మంజూరయ్యాయి. నూతనంగా సబ్‌యార్డు నిర్మాణం కోసం రూ.2 కోట్ల 2 లక్షలు మంజూరయ్యాయి.
మరమ్మతు పనులకు నిధులు మంజూరు
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని పలు యార్డులు, కార్యాలయాల మరమ్మతు పనుల కోసం రూ.2 కోట్ల 2 లక్షల 50 వేలు మంజూరైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పత్తియార్డులోని ప్లాట్‌ఫామ్స్ కోసం రూ.కోటి 15 లక్షలు, బ్యాంక్ భవనం మరమ్మతుకు రూ.20 లక్షల 50 వేలు, టాయిటెట్స్ కోసం రూ.30 లక్షలు, మార్కెట్ పరిధిలో టాయిటెట్స్, టెర్రస్ల మరమ్మతులకు రూ.20 లక్షల 50 వేలు, మార్కెట్ ప్రధాన కార్యాలయం మరమ్మతు, వాటర్ ఫ్రూఫ్ కోసం రూ.10 లక్షలు, వేరుశనగ, పసుపుయార్డులోని గుమస్తాల భవనం మరమ్మతులకు రూ.6 లక్షల 50 వేలు మంజూరయ్యాయి. మార్కెట్లో కూలిపోయిన ప్రహరీ నిర్మాణానికి రూ.60 లక్షలు, రెండో గేటు ముందు రైతు విగ్రహం మరమ్మతుకు రూ.9 లక్షల 20 వేలు, రైతు విశ్రాంతి భవనం నిర్వహణకు రూ.10 లక్షలు మంజూరయ్యాయి. ఆపరాలయార్డులో సబ్ ఆఫీ స్కు రూ.47 లక్షలు, మిర్చియార్డులో రేకుల షెడ్, ప్లాట్ ఫాం కోసం రూ.4 కోట్ల 44 లక్షలు, పల్లి, పసుపుయార్డులో ప్లాట్‌ఫాం నిర్మాణం కోసం రూ.2 కోట్ల 93 లక్షలు, స్వాగత తోరణాల నిర్మాణం కోసం రూ.29 లక్షలు, మిర్చి యార్డులో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.43 లక్షలు మంజూరయ్యాయి. మరో రూ.4 కోట్ల 50 లక్ష నిధులు విడుదలవుతాయని అధికారులు వివరించారు.