సుబేదారి, జనవరి10: హనుమకొండలోని కాకతీయ జూపార్క్‌లో నేటి నుంచి రాయల్ బెంగాల్ టైగర్స్, అడవి దున్నలు సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. డిసెంబర్ 2న హైదరాబాద్ నెహ్రూ జూపార్కు నుంచి రెండు పులులు కరీనా-శంకర్, 20 రోజుల క్రితం అడవి దున్నలు అనిత-శివ జంటను జిల్లా అటవీ శాఖ అధికారులు తీసుకొచ్చి ఎనిమల్స్ కీపర్స్తో ఇక్కడి వాతావరణానికి అలవాటు చేశారు. టైగర్స్, అడవి దున్నల కోసం వేర్వేరుగా రెండు ఎన్ క్లోజర్లను ఏర్పాటు చేశారు.
పెద్ద పులులను సందర్శకులు చూడడడానికి 18 ఫీట్ల ఎత్తులో ఇనుప రాడ్లతో పెద్ద జాలితో డే షెల్టర్, ఆహారం తీసుకోవడానికి, రాత్రిపూట సేద తీరడానికి రెండింటికి వేర్వేరుగా నైట్ షెల్టర్ నిర్మించారు. అడవి దున్నలకు కూడా డే, నైట్ షెల్టర్ ఏర్పాటు చేశారు. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం టైగర్స్, అడవిదున్నల ఎన్‌క్లోజర్స్‌ను ప్రారంభిస్తారని జిల్లా అటవీ శాఖాధికారి లావణ్య తెలిపారు. జంతువుల రాకతో జూపార్కుకు కొత్త కళ రానున్నది. సంక్రాంతి పండుగ సెలవుల్లో పిల్లలు, పెద్దల సందర్శనతో జంతు ప్రదర్శనశాలకు తాకిడి పెరగనున్నది.
పెద్ద పులులను చూసుకోవడానికి హైదరాబాద్ నెహ్రూ జూర్కులో వారం రోజుల శిక్షణ ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడ పులిని కరీనా, మగ పులిని శంకర్ అని పిలుస్తూ వాటికి ఆహారం అందించా. డ్రెస్ కోడ్‌తో గుర్తుపడుతాయి. ఆహారం కోసం ఫేస్ చూపిస్తాయి. ఉదయం 9.30 గంటలకు కిలో చికెన్, అది తిన్న తర్వాత వాటర్‌లో మినరల్స్ ఇస్తాం. సందర్శకులు చూసే డే షెల్టర్‌లోకి వదిలిపెట్టి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేలా చేశాం. రోజూ ఉదయం 9.30కి కిలో చికెన్, సాయంత్రం 5 గంటల తర్వాత 8కిలోల బీఫ్ మాంసం పెడతాం.
– ఎం సాంబమూర్తి, టైగర్స్ కీపర్
అడవి దున్నలకు పొద్దున పాలకూర, క్యారె ట్, డజన్ అరటిపండ్లు, తౌడు బెల్లం, గడక, మధ్యాహ్నం 10 కిలోల పచ్చగడ్డి ఆహారంగా ఇస్తామని కీపర్ కొమురయ్య తెలిపారు. డ్రెస్‌కోడ్‌తో గుర్తుపడుతాయని, వారం రోజులు వా టిని చూడానికి శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు.
బెంగాల్ టైగర్స్ వేసవిలో ఎక్కువగా సిక్ అవుతాయి. పేన్లు, గోమర్లతో టిక్ ఫీవర్ వస్తుంది. టైగర్స్ కీపర్ రోజూ వాటి కదలికలపై ఆరా తీస్తాడు. అనారోగ్యానికి గురైనట్లు తెలిస్తే వెంటనే నైట్ షెల్టర్‌లో బంధించి చెక్ చేసి టీకాలు వేస్తాం. మినరల్స్ ఇస్తాం. సహజంగా పెద్ద పులి 12 ఫీట్ల ఎత్తులో దూకుతుంది. చలికాలంలో అగ్రసిగా ఉంటాయి. ఈ సీజన్లో వాటి దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉంటాం. ఇక్కడి వాతావరణానికి బాగానే అలవాటుపడ్డాయి.
-ఎం సాంబరాజ్, వెటర్నరీ అసిస్టెంట్