జూన్ 13 : తొర్రూరు మండలంలో శుక్రవారం రాత్రి బలమైన గాలులు వీచి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. మడిపల్లి, కంఠాయపాలెంలో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆ యా గ్రామాల్లో సుమారు 70 ఇళ్లు దెబ్బతిన్నట్లు గ్రామస్తులు తెలిపారు. కొండేటి పూలమ్మ, మహంకాళ యాకలక్ష్మి, చిరబోయిన రేణుక, బండారి వజ్రమ్మ, నకరకంటి కర్రయ్య, మహంకాళ సరోజన, మహంకాళ రమణ, వేర్పుల అనితకు చెందిన ఇళ్ల పైకప్పు రేకులు గాలుల ధాటికి ఎగిరిపోయాయి. ఇంట్లోని ధాన్యం, నిత్యావసర వస్తువులు, దుస్తులు, గృహోపకరణాలు వర్షానికి తడిసి భారీగా నష్టపోయారు. రాత్రి కావడంతో బాధిత కుటుంబాలు భయాందోళనకు గురయ్యాయి. అదేవిధంగా గ్రామంలోని మరెన్నో ఇళ్ల పైకప్పులు దెబ్బన్నాయి. గోడలు పాక్షికంగా కూలిపోయాయి. ప్రకృతి వైపరీత్యంతో తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం తక్షణసాయం అందించాలని బాధితులు కోరుతున్నారు.
మడిపల్లిలో ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని తొర్రూరు తహసీల్దార్ గడీల శ్రీనివాస్ పరిశీలించారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. ఇంటింటికీ వెళ్లి పరిస్థితులను తెలుసుకున్న తహసీల్దార్, నష్టం అంచనాలను నమోదు చేసి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో సుమారు 70ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణ ఆర్థికసాయం అందించేలా చర్యలు చేపడుతామని తెలిపారు. ఇళ్ల మరమ్మతుకు నిధులు మంజూరు చేయడంతోపాటు వర్షానికి తడిసిన గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులకు కూడా పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్ఐలు విక్రమ్, వేంకటేశ్, జీపీవో ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.